నానమ్మ నవ్వుకి అర్థం మీరైనా చెప్పరా?

నానమ్మ నవ్వుకి అర్థమేమిటో? అసలది నవ్వేనో కాదో? ఏమో?
అపుడూ తెలియదు,ఇపుడూ తెలియటం లేదు, ఇంకెపుడూ తెలియదేమో?
ఎందులోనూ తొందరపడలేదు, ఎవరిముందూ తేలికపడలేదు.
ఎవరిఎదుటా తలవంచలేదు, అసలవేవీ పట్టనట్లే ఎలావుండేదీ?

తన భాష, బాస బాసట మూడే మూడు. వర్ణించమంటే ఇంతకన్నా ఏమివ్వను వివరం?
లాస్యమాడే హాసం, ద్యోతకమయ్యే మౌనం, తొణికిసలాడే మార్దవం.
దరహాసంతో మౌనం, మౌనంగా ధ్యానం, ధ్యానంలో ప్రశాంతవదనం.
ధ్యాసలో వుంటే మన మాటకి బదులుగ ఓ సమాధానం.

లోతైన ఆ కళ్ళు చెప్పేవి పలుభాష్యాలు.
నవ్వేటి ఆ కళ్ళు నింగంత విశాలం, ఆ కొలనుల్లో నిండేటి నీరు ఓ జలాశయం.
కొలనులా కాదు లోతుకొలిస్తే అఖాతాలు.
తోడేటి కొద్దీ నీరు నింపింది కరిగిన కలల దుఃఖాతిశయం.

నవగ్రహసహిత సత్సాంగాలు గరిపిందా?
సప్తర్షిసమమైన సుగుణాలు గడించిందా?
సుందరమనోహర మానసాన్ని తాను దిద్దుకుందా?
సుమధుర భాష్యంతో స్వభావానికి వన్నెలద్దుకుందా?

తను నాకుచెప్పిన కథలు అపుడు తప్పుగావిన్నానేమో!
ఎంతమంది నరకాసురల్ని వధించానని సంబరపడ్డా, ఇంతకాలానికి అవగతమైంది,
నేను సత్యనవ్వాల్సింది నా మనసనే రాకాసిని మట్టుబెట్టటానికని,
కాదంటే నవరసాల నరకాసురులు నన్నే కబళిస్తాయనీ.

తన లోకాన్ని తానే రచించుకుందా? అసంపూర్తిగా నాకందించిందా?
తాను చూసిన లోకాన్ని పరిచయవ్యాఖ్యగా వ్రాసిచ్చిందా?
నేను కొనసాగించనా, ఈ వరకే ప్రచురించనా? ఏ విధంగానైనా అది కాదా ఓ సంచలనం?
అందుకేనా లోకాన్ని వీడిపోతూకూడా నన్ను చూసి నవ్వింది? తెలుసా మీకేమైనా?

4 comments:

  1. నాయనమ్మ నవ్వు బాగుంది. ఈ కవిత చదువుతుంటే నేను పారిస్ వెల్లినప్పుడు మోనాలిసా మీద రాసుకున్న కవిత గుర్తుకొచ్చింది.
    ( http://pradeepblog.miriyala.in/2007/12/blog-post.html )
    " జీసస్ రుధిర చాయా చిత్రాలు ఒక వైపు
    సుకుమార వనితల శృంగార చిత్రాలు ఒక వైపు
    మహా యోధుల వీర చిత్రాలు మరొక వైపు
    మాతృత్వ మాధుర్యాన్ని పంచే మధుర చిత్రాలు ఇంకొక వైపు…
    ఇన్ని భావాలను తన నగు మోములో చుపించే మొనాలిసా ఆ మ్యూజియంకే తల మానికం "
    ====

    ఇక విషయానికి వస్తే, మనసనే రాకాసి అన్నది నేను ఒప్పుకోను.
    మళ్ళీ అంతలోనే నవరసాల నరకాసురులన్నారు. అదేమిటబ్బా ??
    నవరసాల నరకాసురలవల్ల మనలో రాక్షసత్వం మేలుకొంది తప్పితే మనసు రాకాసి కాదు ఎప్పటికీ.....
    ఇంద్రియ నిగ్రహం అదుపుతప్పినప్పుడే ఈ నవరసాల నరకాసురులు విజృంభించేది.
    నవరసాల నరకాసురులు - నవరాత్రులు ఏమైనా కలపగలరేమో చూడండి.

    ReplyDelete
  2. నానమ్మ నవ్వు కు అర్థం - "అనుభవం" :)

    ReplyDelete
  3. బిగిసిన పెదవులు భావావేశపు
    వెల్లువని కట్టేసిన బంధాలైతే ..
    విడివడిన పెదవులు అనుభవావేసపు
    వెలుగుని వ్యక్తీకరించే సాధనాలు..

    పెదవులు బిగిసి, మన:సంఘర్షణని
    మూగభాషలో మౌనంగా గ్రంధీకరిస్తుంది..
    అవేపెదవులు విడివడి, మన:తర్కాన్ని
    నవ్వుభాషలో విలాసంగా ఊటంకిస్తాయి.

    ఓ జీవిత కాల అనుభవాల కొమ్మ మీద
    పూసిన ఆ అందమయిన నవ్వును
    అందుకోవాలన్నా.. అర్ధం చేసుకోవాలన్నా..
    ఆ నవ్వుతెరల వెనక మర్మాన్ని
    ఆకళింపు చేసుకోవాలన్నా.. అనుభవించాలన్నా..

    ఆ ఎత్తుకి మనమూ ఎదగాలి..
    ఆ జీవిత సారం మనమూ మింగాలి.

    చాలా బాగుంది ఉష గారు... తాత మీద నేను రాసిన ఈ కవిత చూడండి.
    http://aatreya-kavitalu.blogspot.com/2007/06/blog-post_12.html

    ReplyDelete
  4. ముందుగా ఈ జాప్యానికి క్షంతవ్యురాలను. వృత్తికార్యాలవలన వృత్తీతరకార్యాలవలన సమయం తగినంత మిగలలేదు నిజానికి రవ్వంత కూడా దొరకలేదు.

    ప్రదీప్, అవును మౌనంలో వేయి భావనలు, మౌనంగా నవ్వుతూ వేవేల భావనలు తెలుపవచ్చు. మోనాలీసా అందుకొక ఉదాహరణ. మా అమ్మే నాకు మోనాలీసా. తన భాష, భాష్యం నాకు ఇచ్చేసినట్లు ఎంత మౌనంగా వుండేవారో! మీ వ్యాఖ్యతో తన మౌన వదనం తలపుకొచ్చింది.

    ఇక మనసు ఆ రాకాసుల సాంగత్యంతో తనలోకి రాకసిని పరకాయ ప్రవేశంగావించికుందనుకోండి మరి. స్వతహాగా లేని తత్వం ఇలా మనలోకి జొరబడగల అవకాశం కూడా వుందిగా?

    తప్పక "నవరసాల నరకాసురులు - నవరాత్రులు" గురించి ఆలోచించి మరో కవితగా వ్రాస్తాను.

    ఇమాయ గారు, మీరెవరో ఇప్పటికి గ్రహించాను. ఇక మన హిమాలయ యాత్ర ఎపుడో సెలవిస్తే ఆ దిశగా మా నానమ్మ ఏమైనా చెప్పిందేమో ఆమె నాకు పంచిన అనుభవసారంలో మళ్ళీ ఒక్కసారి వెతికిచూస్తాను.

    ఆత్రేయగారు, మీది బహు దొడ్డ కవితా హృదయం. నా కవితకి ఎంతో అపూర్వమైన వ్యాఖ్యనిచ్చారు? మనసు చెమ్మగిల్లినట్లైంది.

    తాత మీద కవిత చదివాను. చిన్ని వ్యాఖ్యతో ముగిస్తాను.
    "ఆ మనిషి వెనుక బుడిబుడి నా అడుగులు
    కావాలి నాకు మార్గదర్శకాలు"

    అందరకూ ధన్యవాదాభివందనాలు.

    ReplyDelete