ఇంకా తెలియదీ నిర్వచనం!

కిటికీనుండి పరికిస్తే చిమ్మచీకటి రంగు,
కీచురాళ్ళు కాదు కాని ఏదో నిశ్శబ్దబేధి,
వళ్ళంతా ముణగదీసుకుని ఆకాశం
మిగిలిన రేయికీ నిదుర మత్తిస్తూ, కాలాన్ని పట్టి ఆపేట్టు.

భూమి భారంగా తిరిగి గడిపిన రాత్రి కాలం,
తిధి వారం ఎంచక కాలు మోపిన మరో ఉదయం,
అంతటా చలనం, వళ్ళు విరిచిన ఆకాశం
తరగని పగలుకి పూర్ణ కుంభమిచ్చి ఎదురేగినట్టు.

చెరువులో పెద్దచేపకి కొత్త జబ్బు స్థూలకాయం,
ఒడ్డునుండి పట్టేవాడి పాత అవలక్షణం భారీకాయం.
పునాది నుండి లేస్తున్న మరో ఆకాశహర్మ్యం.
ప్రకృతిని మించిపోవాలన్న మనిషి లక్షణం.

పగలు రేయి పునరావృతాలు, భూభ్రమణాలు,
ఋతువుల రాకపోకలు, మారే వర్ణాలు,
నడుమ చీకు చింతల నిత్యజీవిత పారాయణాలు.
నేను నియంత్రించలేనివేనా బ్రతుక్కి నిర్వచనాలు?

9 comments:

  1. ఎవరు నియంత్రించగలరు బ్రతుకు నిర్వచనాలు?
    నిమిత్త మాత్రుడు నరుడు కానీ
    ప్రకృతితో పోరాటంలో ప్రకృతి నరుడు ఇద్దరూ గాయపడుతున్నారు.
    ప్రకృతితో స్నేహమే మనకు మంచిది.

    ReplyDelete
  2. కవిత చదవగానే కామెంట్ రాయాలనిపించింది. కామెంట్ రాయడానికి ఏదో ఒక ప్రేరణ కావాలి. ఆ ప్రేరరణ ఏపాదమో అని తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చదివా.. ఏ పాదము తీసి వేసి కవిత చదివినా అసంపూర్తిగా అనిపించింది. అందుకే ఏ పాదానికాపాదమే సరిసాటి.

    ReplyDelete
  3. ప్రదీప్, ప్రకృతి తన విలయతాండవం మొదలిడక మునుపే మనిషి తన హద్దులు తెలుసుకుంటే బాగుండు. ప్రకృతిలో మమేకమై ఆ స్వఛ్ఛతనే తన ప్రవర్తనలోనూ ప్రతిఫలింపచేస్తే ఇంకా బాగుండు. ఇదేదో పగటికల మాదిరిగా అనుకుంటున్నారా? కలలు, వూహలే కదా రేపటిలో ఆశకి పునాదులు.

    భాస్కర రామి రెడ్డి గారు, ఎంతో ముచ్చటగా తెలిపిన మీ ప్రశంసని అంతే మురిపెంగా స్వీకరిస్తున్నాను. క్లుప్తంగాగే తెలిపినా ఈ మాత్రం వస్తువు లేనిదే భావం ప్రకటితమవదనిపించింది.

    నిజానికి ఓ రకమైన నిర్లిప్తత కూడా ఆ కవితకి ప్రేరణ. కేవలం నిమిత్తమాత్రులం అన్న సత్యం కాస్త కటువుగానే వుంటుంది.

    మీరిరువురకూ నా ధన్యవాదాలు.

    ReplyDelete
  4. నిశీధి ను౦చీ శుభోదయానికి చేసే నడకలో జీవితప్రయాణము ఉ౦దని చూపారు.
    నడుమ కలలే బహుశా మీరు చెప్పిన చీకుచి౦తలకు నా౦ది అనిపి౦చేలా రాసారు.
    మీరు మీరే! ఉష గారూ, మాబాగా చెప్పారు!

    ReplyDelete
  5. ఉషాగారు ! చివరి పేరా ...ఎంతబాగా రాశారు ! తెలిసీ ప్రకృతికి హాని చేస్తున్నాం . విలయానికి ఆహుతవుతాం !

    ReplyDelete
  6. తెలుసు ...అన్నీ తెలుసు ...అంతా తెలుసు,
    కానీ ఆ అన్నీ ఎన్నో ?
    ఆ అంతా ఎంతో ఇంకా తేలీదు

    ReplyDelete
  7. ఆనంద్, హేతువు, నాందీ తెలిసి తెలిసీ ఆ వలయం నుండీ ఈవలికి రాలేకపోవటం, తద్వారాగా ప్రకృతికి హాని చేయటం మనిషి బలహీనత.

    పరిమళం గారు, అవునండి, యుగాంతం నాటికైనా మనలో ఆ మేలుకొలుపు వస్తే బాగుండు. హతమవటం, అంతరించిపోవటం కన్నా ఆ జాగృతి కలగటం మన చివరి శ్వాసకి ఒక అర్థాన్నిస్తుందేమో!

    శశీ, నా బ్లాగుకి సాదర స్వాగతం. అలా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలి వుండటమే జీవితం పట్ల ఆసక్తిని, బ్రతుకులో జిజ్ఞాసనీ నింపుతుంది అని నా అభిప్రాయం.

    అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  8. చాలా బాగుంది.

    http://muralidharnamala.wordpress.com/2009/04/29/mypoetry/

    ReplyDelete
  9. తిరిగిలా ఒకమారు తొంగిచూసినందుకు ధన్యవాదాలు, మురళి.

    ReplyDelete