నా మదే గువ్వగా నీ అరచేత వాలింది!

నీ కనురెప్పల కావలి నేనై నీ చూపు నాపైనే నిలుపుకుంటాను,నీ గుండె గుడి దీపమై నా చెలిమి చమురు నింపుతాను,
నీ పలుకుల తేనియనై మన సంగమ కృతులు ఆలపిస్తాను,
మళ్ళీ వస్తావా ఒక జీవిత కాలానికి నా అతిధిగా, అపురూప వరంగా?
అవును ఒకమారు మనం కలిసి చూసిన అనుభూతులివి.
అపుడు రాయంచ రాయబారమంపాను స్వయంవరానికని.
బదులుగ నీవంపిన సిరిమువ్వల హారాలు నా అందియలై నటనమాడాయి.
మరొకపరి నా మది ఆ స్మృతులు కావాలంటుంది క్రొత్తగ ఏం కోరుకోనుందో?
నేను నీతో కలిసి సప్తసాగరాలు ఈదేసాను, సఫలీకృతురాలనయ్యాను.
సప్తస్వరాలు అలాపించేసాను, సుస్వర గానాలు చేసాను, సప్తపదింకేలనన్నాను.
సప్తర్షిమండలాలు తిరిగి వచ్చాను, సంతృప్తి సంహితనయ్యాను.
సప్తవర్ణ స్వప్నాలు కన్నాను, గాఢమైన సుషుప్తి చెందాను.
అవన్నీ నా కలల రూపాలని, కరిగిపోవునని ఆలస్యంగా మేలుకున్నాను
అనుభూతులు పరుచుకుని పగలు, రేయి ఎంచక పయనాన్ని ఆపేసానేమో
నీవు నెలవు వదిలేసావనీ, బహుదూరం సాగిపోయావని, నేడే కనుగున్నాను
ఈమారు ఆ బాట పట్టను, వాస్తవంగా నిన్ను మాత్రం మిగుల్చుకుంటాను
నీ అడుగు ప్రక్కనే నాది పడుతుందిక, నిన్నిక నన్ను దాటిపోనీయను,
నీ గుండె పాన్పుపై నాకే అనుమతిక, నిన్నిక నానీడకైనా పంచను,
నీ చిరునామా నాదవుతుంది, మనదన్నది లోకమొక్కటేవుంటుంది,
ఈ బాసలు నీకంగీకారమని తెలుపను నా మదే గువ్వగా నీ అరచేత వాలింది.

8 comments:

  1. ఎప్పటిలాగే చాలా బాగా రాసారు ఉషగారు

    ReplyDelete
  2. చాలాబాగా వ్రాశారు.శుభా కాంక్షలు.

    ReplyDelete
  3. మొదటి సారి మీ బ్లాగు చూసాను.
    చాలా బాగుంది.

    -చందమామ

    ReplyDelete
  4. జీవితప్రణయాల గత౦, సహజీవన ప్రయాణాల స్వగత౦.
    మొదటిసారి మ౦చికి ఊసరవెల్లితో అనునయ౦,
    ఎన్ని ర౦గులకలల కలబోత మీ సాహిత్య౦.
    వరదగోదారి ఉధృత౦, కవన పరవళ్ళ నృత్య౦.

    మీ కవిత అద్భుత౦!

    ReplyDelete
  5. నిన్నిక నానీడకైనా పంచను

    I guess, this possessiveness is received with love by most men in Indian culture. In others, it is a wrong behavior. One must respect this cultural difference, but it is weird though. As an Indian, I felt your words were extremely sensitive and sensible. Lovely!

    ReplyDelete
  6. నేస్తం, మీకు నచ్చినందుకు ధన్యవాదాలు - ఇది స్వగతంకి కొంత వూహ జోడించిన వైనం.

    జయచంద్ర, చందమామ, నా బ్లాగుకి సాదర స్వాగతం. మీ బ్లాగులు క్లుప్తంగా చూసాను, మరోమారు క్షుణ్ణంగా చూస్తాను. కానీ మీ అందరిలోని స్ఫూర్తి మాత్రం చాలా మెచ్చుకోదగిన విషయం.

    ఆనంద్, ఇక మీరు "వ్యాఖ్యాబ్రహ్మ"లైపోయారు. ఏమని వివరించను మీతీరు. కాని కవితలోని ఆత్మని కనిపెట్టారు. సంతోషం. వూహని విడతీసి, కనీసం వాస్తవాన్ని చేరాల్సిన తీరానికి చేర్చాను ఈ కవితగా.

    అందరికీ ధన్యవాదాలు. సమయాభావం వలన వెంటనే వ్యాఖ్య పెట్టలేకపోయాను,మన్నించండి.

    ReplyDelete
  7. మీరు లింక్ ఇచ్చి చాలా రోజులైంది. అందుకు నేను సారీ చెప్పెను. ఎందుకంటే నాకు ఎందుకు ఆలస్యం ఐంది అన్నదాని మీద క్లారిటీ ఉంది. ఏదో అలా వచ్చి ’చాలా బాగుంది ఉష గారూ’ అనేసి పోవటం నాకు చేతగాని పని.

    ఒకరి అనుభూతి వారికే సొంతం. ఇతరులతో పంచుకున్నా అది కొంతవరకే. కానీ ప్రేమ అలా కాదు. అలా అని అందరూ ఒకే ఇంటెంసిటీతో ఉండాగలరన్నా సాధ్యం కాదు. అందుకే మీ కవితానుభూతిని నా స్వానుభూతితో విశ్లేషించి నా అనుభూతిని అక్షరబద్ధం చేదామని ఇంతసేపు ఆగాను. అర్థం అయిందనుకుంటాను? :-)

    వాల్మీకి మహర్షి వాడే ప్రతిపదమూ వృధా పోదని ఒక వరముందట. అందుకే ప్రతి పదానికీ అనంతార్థాలు తోస్తాయని తెలుసుకున్నాను చిన్నతనంలోనే.

    అంతవారని మిమ్మల్ని మోసం చేయనుకానీ, మీ ప్రతి పదంలోనూ నాకు అవ్యక్తమైన భావాలంకరణ కనిపిస్తున్నది. ప్రతీ పదంతో మమేకమయ్యాను. ఇక ఇప్పటికింతే.

    కానైతే ఒక్క మాట. మీ భావుకతోధృతిని తట్టుకోవటమూ నాకు కష్టమైనది.

    ReplyDelete
  8. గీతాచార్య! "వాల్మీకి మహర్షి వాడే ప్రతిపదమూ వృధా పోదని ఒక వరముందట" మీరన్నాక లీలగా గుర్తుకి వచ్చింది. ఈ మాట మునుపు విన్నాను, కానీ ఆ సందర్భం జ్ఞప్తికి రావటం లేదు. నా కవిత నోచుకున్న భాగ్యం ఆ ప్రస్తావన మీ వ్యాఖ్యలో రావటం. మీ వ్యాఖ్య కారణంగా నేనూ మరోసారి నా భావాల్ని ఆలింగనం చేసుకున్నాను, మీ స్వానుభూతినీ దర్శించాను. జీవితాన్ని అనుభూతులతో కొలుచుకునే నాకు భావావేశం, భావుకత ఉధృతి వరదలా, ఉప్పెనలా కమ్మేస్తుండటం సహజమా, అసహజమా అన్నది కాలమో, నా కవితలో నిర్ణయించి, నిర్దేశిస్తాయేమో. మీ వ్యాఖ్యని మాత్రం అమూల్యంగా పదిలపరుస్తాను. నెనర్లు.

    ReplyDelete