గోడ గుండె పగిలింది!

అనగనగా కోట బురుజు వంటి గోడ,
దాని వెనుక ఏడంతస్థుల మేడ.
ఓ ప్రక్క గుబురైన కొమ్మల గోరింట చెట్టు,
కొమ్మల్లో ఓ బంగారు పిచ్చుక గూడు.

మేడలో మనుషుల నడుమ మరిన్ని గోడలు,
పైకి తేలని ఆ లోగుట్లు కాపుకాయను అగచాట్లు.
గూటిలో పక్షుల నడుమ పుల్లా పుడకలు,
పైకి ఎగిరే ఆ పిట్టలు అవనిపై అవధూతలు.

ఆషాఢాన పది చేతులా లేలేత రెమ్మల ఆకాకు దూసి,
ఆఖరుకి కొమ్మనీ విరిచి గూడు చెదరవేసె ఆ మనుషులు.
మనువాడినా మనసులు కలవని మాట మరిచి,
పండిన చేయి చూసి మురిసేటి పడతులు, చెంత ఉపపతులు.

గూడు మళ్ళీ కట్టాయి అంతరాలు లేని ఆ జంట పక్షులు.
గోడ మీద వాలి ఆదమరిచి చేసాయి కిలకిల రావాలు.
పక్షిరీతి మనలేని మనుషుల నడుమ పెరిగే గోడలు,
చెదరని చెలిమిలో గూడు పేర్చుకునే ఆ పక్షులు.

ఇపుడు వాళ్ళు మరమనుషులు, మమతలెరుగని ముష్కరులు.
తారతమ్యాలు గోడలు దాటి వూళ్ళకి చేరాయి.
కొమ్మలు ఇక వేయలేనని విరిగింది మోడైన గోరింట,
బీటలిచ్చిన గుండె పగిలి నేల వాలింది గోడ.

[
అవధూతలు: నేను, నాది అన్న భావముగాని, గౌరవా గౌరవాలన్న తేడాగాని ఉండనివారు అవధూతలు. అవధూత తన నడవడిక ద్వార జ్ఞానస్వరూపాన్ని చూపిస్తారు.
Upapati – Married but in love with another woman.]

31 comments:

  1. http://parnashaala.blogspot.com/2008/07/blog-post_31.html

    ReplyDelete
  2. ఉష గారు, అవధూతలు అంటే అర్థం చెప్పగలరు
    మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాల ప్రాధాన్యత గురింది చక్కగా వర్ణించారు
    అభినందనలు..

    ReplyDelete
  3. మహేష్, అవును పగలాలి ఈ విబేధాల గోడలు, మనసు బీడులో మమతలు మొలకలెత్తాలి. తనువుల్ని కలిపేది మనువులు కాదు, పెనవేసిన అనుభూతులు. ఆ కలయికలే మనిషి మనుగడకి పెట్టని గోడలు.
    తొలివ్యాఖ్యగా చక్కని మీ కవిత చదివించారు. కృతజ్ఞతలు.

    ReplyDelete
  4. హరే కృష్ణ, నేను, నాది అన్న భావముగాని, గౌరవా గౌరవాలన్న తేడాగాని ఉండనివారు అవధూతలు. అవధూత తన నడవడిక ద్వార జ్ఞానస్వరూపాన్ని చూపిస్తారు. కవితలోని ఆత్మని గ్రహించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. ఉష గారు,
    చాలా బాగుందండి. చక్కగా చెప్పారు.

    ReplyDelete
  6. చాలా బాగుందండి .

    ReplyDelete
  7. "మేడలో మనుషుల నడుమ మరిన్ని గోడలు," ..బలమైన గోడలు అనాలేమోనండి... చాలా బాగుంది..

    ReplyDelete
  8. చాలా బాగా రాశారు, మీ వివరణ చాలా బాగుంది."బీటలిచ్చిన గుండె పగిలి నేల వాలింది గోడ".ఈ లైను చాలా బాగుంది

    ReplyDelete
  9. ఆ కవితని ఇక్కడే పెడుతున్నాను;

    గోడలు

    నీ చుట్టూ ఆరడుగుల అభిప్రాయాల గోడ.
    అయినా, తలుపు తెరిచి ఆహ్వానించావు.
    రావాలో వద్దో నాకు తెలీదు.
    ఒకవేళ వస్తే...మళ్ళీ బయటపడగలనా?
    అదీ తెలీదు!

    కోటకన్నా ఎత్తైన నా భావాలతో కదలి వచ్చినా...
    నీ అభిప్రాయాల గోడజాడనైనా మిగులుస్తానా!?
    లేక...మన ఇద్దరి రాపిడి కలయికకు గోడలు బీటలువారి
    నిజాలు గోచరిస్తాయని ఆశపడనా!

    లేదూ... ఇద్దరి అభిప్రాయాలూ,భావాలూ మన కలయిక తీవ్రతకి
    పగిలి శిధిలమై, కేవలం అనుభూతులే మిగులుతాయని కోరుకోనా!!
    అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను.

    మనం కలవాలి.
    కలిసి తెలుసుకోవాలి.
    తెలిసి అనుభవించాలి.
    బంధింపబడటమో!
    జాడైనా మిగలకపోవడమో!!
    నిజాలు గ్రహించడమో!!!
    లేక శిధిలమై...భావాభిప్రాయ రహితులై
    కేవలం అనుభూతుల్నే మిగుల్చుకోవడమో జరగాలి.

    మనం తప్పక కలవాలి.
    ఈ గోడల్నిదాటి ఆ కలయిక జరగాలి.

    ReplyDelete
  10. ఉష,
    ఈ వాక్యం ఉద్దేశం కాస్త వివరిస్తారా? ఈ మట్టి బుర్ర కి తట్టడం లేదు!
    "కొమ్మలు ఇక వేయలేనని విరిగింది మోడైన గోరింట"

    ReplyDelete
  11. * శేఖర్, కథాసాగర్ గార్లు, ధన్యవాదాలు, మీరిరువురవీ తొలి సారి వ్రాసిన వ్యాఖ్యలు.
    * మురళీ, ఆ చివరి పంక్తిలో బురుజు వంటి గోడ కూలటం, ఈ కనపడని/ఎప్పటికీ కూలని గోడలెంత బలమైనవో అన్యాపదేశంగా తెలపటానికే వాడాను. నెనర్లు.
    * హను, గోడకి చెవులుంటాయని వ్యంగ్యార్థంలో వాడినట్లే, అదే గోడకీ మానవతా/సమత/మమత దృష్టి వున్న మనసు/గుండె వుందని చెప్పటం కవిత ద్వారా నా కల్పన. ఆ ప్రయోగం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
    * మహేష్, నేననుకున్నది అడిగేలోపు మీరే చేసారు, కృతజ్ఞతలు.

    ReplyDelete
  12. * ప్రసాద్ గారు, గోరింట చేతి మీద పండే తీరుని బట్టి కాబోయే మగని తీరుని నిర్ణయిస్తూ పాటలు పాడతారు - మందారం, మంకెన, మావి చిగురు ఇలా ఆ వన్నెలని బట్టి వుంటాయి వరుని రీతులు. వీటికి నేను వ్యతిరేకిని కాదు, కానీ, ఆ తరవాత దంపతుల నడుమ కలహాల గోడలే ఈ కవితకి ఆత్మ. అంత కలలు కనే కన్నెలు, కాపురానికి రాగానే మారే వైనం, కోరి వచ్చిన ఆమెని కాదనుకునే మగవారి నైజం చూసి చూసి ఇక వీరి కోసం నేను చివురులు వేసి కాపురాన పండని కలల్ని అరచేతుల పండించలేనని విసిగి వేసారి గోరింటా తలవాల్చేసిందని చెప్పటం ఆ పంక్తి ఉద్దేశ్యం, అపుడపుడూ నేను క్లుప్తత-స్పష్టతల నడుమ సరైన న్యాయం చేయలేను. అంతే కానీ మీది మట్టి బుర్ర కాదు, మీ ప్రశ్న మట్టిలో మాణిక్యం. అందుకే ఈ వివరణ ద్వారా మరికొందరికి తమని తాము ప్రశించుకునే అవకాశం ఇచ్చివుండొచ్చు. ధన్యవాదాలు.

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. ఉషా,
    మీ వివరణ బాగుంది. అంతరాల గోడల గుండెలు పగిలి, అన్ని జంటలూ పక్షుల జంటల్లాగా విహరిస్తాయని అశిద్దాం!

    ReplyDelete
  15. ప్రసాద్ గారు, తిరిగి వివరణ చదవను తొంగిచూసినందుకు, దానితో సంతృప్తిచెందినందుకు ధన్యవాదాలు. మరువం పరిమళాల్లోఇదొకటి, ఇంద్రధనుస్సు మాదిరే మరో కొమ్మ మరో ఆఘ్రాణింపునిస్తుంది. రావటం మానకండి.

    ReplyDelete
  16. ఆఘ్రాణింపునిస్తుంది అర్థం కాలేదు ఉష గారు

    ReplyDelete
  17. హరేకృష్ణ, ఆఘ్రాణించటం అంటే వాసన చూడటం. రకరకాల సువాసనలు నా మరువం వెదజల్లుతుంది అని చెప్పానన్న మాట. Nov '08 నుండి మీరు నా కవితల శీర్షికలు [సమయానికున్న విలువ తెలుసు కనుక అన్నీ చదవమని అడుగను] చూస్తే మీకే అర్థమౌతుంది నేనన్న మాట! సప్త వర్ణాలని మించిన వైనాలవి. అందుకే జన్మదిన టపాలో http://maruvam.blogspot.com/2009/05/blog-post_09.html (మరువం జన్మదినం - సాహితీమిత్రులందరికీ శతసహస్రకోటి ధన్యాభివందనాలతో ... ) లో కొన్ని మాత్రం ప్రస్తావించాను. వివరణ కోరినందుకు ఆనందం. నేను కూడా ఇలా నేర్చుకోవాలని తెలుసుకున్న పదాలివి. ఇపుడు వాడే అవకాశం, అవసరం కలిగాయి. బ్లాగ్లోకం నాకు ఇచ్చిన వరం ఇది - సాహితీ మైత్రి. నెనర్లు.

    ReplyDelete
  18. ఉష గారు, ఇంతకీ ఎవరిదా గోడ గుండె, ఎవరా పతులు ( ఉపపతులు))?

    ReplyDelete
  19. చెప్పను భాస్కర రామి రెడ్డి [భా రా రె] [భా రా] [రా రె] గారు, అది చిందంబర రహస్యం. భా రా రె - బాగుందండి, సి నా రె మాదిరి. ఆత్రేయ గారు భలే కుదించారు. పైన వ్యాఖ్యల్లో సవివరణ వుందండి. గోడ అన్నది మన కుటుంబవ్యవస్థకి నేను వాడిన కాల్పనిక ఉపమానం. మేడ అన్నది కాపురం. తరిచి అడిగినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  20. * ప్రదీప్, "పురుషద్వేష సంఘమేమైనా పెట్టారా కొంపదీసి?" నేను మనిషిని, ఏ ద్వేషినీ కాదు :) విద్వేషాలు పోవాలనే నా ప్రయత్నం. ఒకసారి వ్యాఖ్యలు వ్రాసిందెవరో చూడండి. అందరూ మగవారే. నిజంగా ఇది స్త్రీ పక్షపాత రచన అయివుంటే వారిలో ఏ ఒక్కరైనా "అహో" అనేవారేమో. నా ఉద్దేశ్యం అది కాదు, వ్యాఖానించటం వారి వారి ఐఛ్ఛికాన్ని బట్టి వుంటుంది. పోతే మీది బలం లేని అభియోగం. ఇందులో స్త్రీ, పురుష విభేధాలని ఎత్తిచూపానే కానీ, ఏ ఒక్కరి మీదా నిందారోపణ చేయలేదు, మార్గోపాయం చూపలేదు. అవి పరస్పరం తర్కించుకుని సమన్వయంగా పరిష్కరించుకోవాలి. కవిత సమస్యని చూపింది అంతే. కాపురస్తుల్లో పరిణితి వచ్చాక ఇది వుండదు. అంతవరకు వయోపరిమితి లేని, స్త్రీ పురుష భేధం లేని సమస్య ఇది. నా కాన్సెప్టు, దాన్ని వర్ణించిన వైనం మీకు నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  21. నిజమే మీరు స్త్రీ పురుష విభేదాలు ఎత్తి చూపారు కానీ కేవలం మగవారిని మాత్రమే వేలెత్తి చూపినట్టుగా అనిపించింది ఉపపతి అన్న పదంతో.
    "పైన వ్యాఖ్యానించిన వారంతా మగవారే" -- నిజమే కాదనలేదుగా. వారికి అలా అనిపించి ఉండకపోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు కదా మరి.
    ఏదేమైనా నా వ్యాఖ్య బాధ కలిగించి ఉంటే క్షంతవ్యుడిని.
    (పైన రాసిన వ్యాఖ్యను తొలగిస్తున్నాను. ఇప్పుడీ వ్యాఖ్య కూడా నా సమాధానం మాత్రమే)

    ReplyDelete
  22. * ప్రదీప్, వ్యాఖ్య తొలగించటం మాత్రం బావోలేదండి. "ఉపపతి" వాడకం కొంచం తీవ్రతని పెంచింది నిజమే కానీ ఆ పంక్తి, పైన పంక్తి స్త్రీ ని కూడా విమర్శించింది. నిజానికి ఏ ఒక్క స్త్రీ చదువరీ వ్యాఖ్యానించకపోవటం కూడా నాకు ప్రశ్నార్థకమైంది. మీ వ్యాఖ్య నాకు బాధ కలిగించలేదు కనుక మిగిలినది మనకి వర్తించదు, దాన్ని వెనక్కి తీసేసుకోండి. నేనూ ప్రతిస్పందించాను కానీ మీ నుండి ఈ రెండూ మాత్రం [వ్యాఖ్య తొలగించటం, క్షమ ప్రసక్తి] ఆశించలేదు. ఇక చర్చలకి అర్థం ఏముంటుంది. నా మనో భావాలు అంత త్వరగా దెబ్బతినవులేండి, తిని తిని తినగ తినగ వేము తీయనౌను బాణీలోకి వచ్చేసా!.... మళ్ళీ మరువాన్ని పలుకరించటం మాత్రం మానకండి. మీ సద్విమర్శలు సదా కావాలి.

    ReplyDelete
  23. మౌనం అర్థాంగీకారం, చిరునవ్వు పూర్ణాంగీకారం. రెండూ వున్నాయి కనుక .. ఓకే :)

    ReplyDelete
  24. హ్మ్ .....
    స్పందనలు ...సందేహాలూ ...సమాధానాలూ ...అన్నీ అయిపోయాయి .
    చివరగా అవధూత , ఉపపతి లకు అర్ధం చెప్పటం బావుంది .ఉషాగారు , ఈ పధ్ధతి కొనసాగించాలని కోరుకొంటున్నాను .ప్రతిసారి అని కాదు కానీ వాడుకలో లేని లేదా కఠిన తరమైన పదాల అర్ధాలను వివరిస్తే బావుంటుంది .మీ వీలును బట్టి .

    ReplyDelete
  25. * పరిమళం గారు, స్త్రీ చదువరులలో మొదటి వ్యాఖ్యాత మీరు ఈ సమస్య పట్ల స్పందించటంలో. ఇది ఏ ఒక్కరిదో ఆ మాటకొస్తే నా జీవితంలోనిదీ కాదు. నేను సాక్షినైన నాలుగు తరాల్లోని కుటుంబ సమస్యల్లో ఒకటైన దీన్నీ ఇన్నాళ్ళుగా గమనించి ఒక చర్చగా ముందుకు తీసుకురావటానికి ఈ కవితగా కల్పన జోడించి వ్రాసాను. మీ సూచన పాటిస్తాను. మొదట్లో కొన్ని రచనలు చదివినపుడు నాది చాలా సరళమైన భాష అనుకున్నాను, నేనూ కొన్ని వాడుకలోలేని పదాలు తీసుకుంటున్నానని అనిపించింది, కనుక అటువంటి వాటికి తప్పక అర్థం ఇస్తాను. నెనర్లు.

    ReplyDelete
  26. ఉష గారు, మీ కవితలే కాదు వ్యాఖ్యలకు మీ స్పందనలు కూడా నాకు చాలా చాలా నచ్చుతాయి...like, the way you take time to acknowledge your readers :-)

    ReplyDelete
  27. నిషిగంధ, నా బ్లాగులో మీ ద్వితీయ వ్యాఖ్యకి [దీనికెక్కడలేని లెక్కలు, ఎప్పటెప్పటి గుర్తులో అని మురిపెంగా తిట్టే మా పెద్ద అత్తయ్యను మళ్ళీ తలపోస్తూ..] ధన్యవాదాలు. ఈ రోజుతో నా స్పందనలు-ప్రతి స్పందనలు చదివేవారి లెక్కకి ++1 కలిపాను ;) మరి ఆ చదువరులే కదండీ మనని మరోసారి మనోగతంలోకో, వూహాలోకంలోకో తోసి సమాధానం రాబట్టుకునే ఘనులు. అంచేత వారు వెచ్చించిన సమయం పట్ల నా కృతజ్ఞత ప్రతి స్పందనగా తెల్పుకోవటం నేననుసరిస్తున్న సాంప్రదాయం. అందులోనూ ఉత్తరాలు వ్రాసే అలవాటు ఏళ్ళ తరబడి వదల్లేదు. భావన గారి లేఖలు మొదలయ్యాయి కదా ఇక అటు ఓ లుక్ వేసి మీకు కాసింత తెరిపి ఇవ్వనా? ;)

    ReplyDelete
  28. ఉష గారూ నిజం చెప్పేస్తున్నా.నేను మీ కవితలకన్నా మీ వ్యాఖ్యలకి,వివరణలకి పెద్ద అభిమానిని.మళ్ళ మళ్ళా చదువుతూ వుంటా మీ మాటల్ని.

    ReplyDelete
  29. * రాధిక, అమ్మో అమ్మో ఎంత ఎత్తు మునగ చెట్టు ఎక్కించేసారు [నేనే ఎక్కేసానా]? దూకటం, మోకాలి చిప్పలు పగలుకొట్టుకోవటం అలవాటు. ఇప్పుడూ దిగాలేను, ఇక్కడే కూర్చోలేను (తప్పకుండా విరిగే సూచనలున్నాయి) .. :) కానీ "మీ వ్యాఖ్యలకి,వివరణలకి పెద్ద అభిమానిని.మళ్ళ మళ్ళా చదువుతూ వుంటా మీ మాటల్ని" ఇది మాత్రం made my day! నేనూ ఓ మాట చెప్పేయాలి. అసలు వచనంతో మొదలైన నా బ్లాగులో మీ కవితలు చదివాకే ఎపుడో మానేసిన కవిత్వం తిరిగి జీవం పోసుకుంది నాలో అందుకే ఆర్తి http://maruvam.blogspot.com/2008/12/blog-post_2959.html తో నా ద్వితీయాంకం మొదలైంది. అనుకోనిది యాదృచ్చికంగా ఈ కవితకి వచ్చిన ఒకే వ్యాఖ్య మీదే! మీరు మరువపు వనాన విహరిస్తారని మా వేగులు ఎప్పటికప్పుడు నాకు వార్త చేర వేస్తున్నారు లేండి. ఎంతైనా గోదావరి జిల్లా వాళ్ళు గోదావరి జిల్లాల్లోనే పుడతారు కదా.. కానీ అన్ని జిల్లాలతో కలిసిపోతారు :) ఏదో ఓ పుల్ల కదపటం కాస్త కన్నెర్ర చేస్తారు మిగిలినవారని హ హ హ్హా... నెనర్లు.

    ReplyDelete
  30. ఉష గారూ ఏమిటండి అలా అంటారు?కవితం ఎక్కడ వుంటే అక్కడ నేను వుంటాను.మంచి కవితలు రాసి అందరినీ ఆకర్షిస్తున్నారు.మీ వేగులకెందుకులెండి పని.నేనే చెప్పస్తున్నా మీ కవిత చదవడానికొకసారి,మీ కామెంట్లు చదవడానికి నాలుగు సార్లు వస్తాను మీ వనానికి.మీరు రోజుకో కవిత రాసేస్తారు కాబట్టి అన్నింటికీ కామెంట్లు రాయడం కుదరదు.కొన్నిసార్లు రేపెలాగు కవిత రాస్తారుగా దానికి రాద్దాములే అని బద్దకించేస్తానన్న మాట.

    ReplyDelete
  31. రాధిక, చూసారా నిజం చెప్పించాను :) jk నా మాటలే వేగులు. రాములోరికి గానీ మనకెందుకండి వారి సాయం. రాజ్యాలేలుతున్నామా, రంగమెల్లాలా, ఏదో మన వనం, ఓ మరువపు కుదురు. కుదురుగా దాన్ని పెంచుకునే నేను. ఇవన్నీ సరదాల్లో ఓ భాగం, అంతా మూతి బిగించుకు వ్రాస్తూ పోతే ఎలాగ కదా! నా పట్ల మీ ఆదరణపూరిత పలుకులకి మరోమారు కృతజ్ఞతలు. జైహో బ్లాగ్మిత్రత్వం...

    ReplyDelete