కంఠోపాఠం

కంటికి పొర కమ్మినాదే
కలువా మరోమారు ఆ కొలనున విచ్చవా?
మనసుకి ముసుగు కప్పినారే
ఎడదా ఈసారీ దోబూచులాడవా?
బ్రతుకుకి తెర తీసినారే
మనిషీ యేదింకోపరి నటించవా?

ఏల నీకా బేలతనం
ఎందుకా కలవరం
వూగిసలాడు లోలకం
నిన్నొదలని మోహావేశం
ఆపతరంకానిదీ పయనం
భావరాగాల కల్లోల సాగరం

అవసరం నీదగు అభినివేశం
అనివార్యం పరుల అభిజాత్యం
పునరావృతం నిను చేరు ఆశనిపాతం
పురోగమనం నీకు తగు హితవచనం
నిరంతరం నీవు చేయు అన్వేషణం
గెలుపోటమికతీతంగా జీవితానికో ఒప్పందం

సామాన్యుడు

ఆకలిదప్పులున్నవాడు
నిద్రాహారాలు మాననివాడు
దినపత్రిక వదలనివాడు
ఆమడ దూరం పరుగిడలేనివాడు


ఆలోచనలెరుగనివాడు
ఆటపాటలకి పెదరాయుడు
మాటల కోటలు కట్టెడివాడు
నవ్వుతొ పడగొట్టే వట్టి కోతలరాయుడు

కంటిచూపుకి దొరకనివాడు
కంటినీటికి కరగని వాడు
దాకలో కూరకి నోరూరెడివాడు
చేతికందితే చిలిపి ఆకతాయి వాడు

వూరు బలాదూర్ వాడి తీరు
చినుకు రాలితే బజ్జీకి హోరు
వొడిన వాలితే మహాజోరు
సగటు జీవితాన వాడికి జోహారు

మనసు వెలితిగా వుందంటే
నాకు చేతినిండా పనుందనెడి ఘనుడు
మాట నిలుపుకోను మోసగాళ్ళకి మోసగాడు
ఆవారా ఈవారా వాడు అతి సామాన్యుడు!

నానీ, బుజ్జి, చంటీ, పెదబాబు, కన్నా - ఎవరో!
అతడెవరూకి అసలు సమాధానం వీడేనా? ;)

**********************************
నిజానికి నా చుట్టూ గమనించే ఎందరో "అతడు" లకి ప్రతీక ఈ సామాన్యుడు. నా అతడెవరు? అన్న ప్రశ్నకి కొంచం వ్యంగ్యం, హాస్యం కలబోసి వ్రాస్తే - సరళమైన భాషలో, సాదా సీదాగా, సామాన్యునిగా వచ్చిన వాడు - వీడూ తక్కువ కాదు, అందరివాడు, అందరివంటివాడు, మీవాడు. ;) ఏమంటారు?

స్వతంత్ర భారతి - స్వేఛ్ఛాగానం

ఏదో ఆలాలన
ఎదలో ఆవేదన

"తెప్పలెల్లి పోయాక
ముప్పు తొలగిపోయిందే
నట్ట నడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే"
ప్చ్ మనసంగీకరించదేం?

"జయ జయ ప్రియ భారతి
జనయిత్రీ దివ్యధాత్రి"
అనేందుకు గళం విడదేం?

"భరత మాత పుణ్య చరిత
భరతభూమి పుణ్యభూమి
భరత ధాత్రి అందుకొనుమిదే
పుష్పాంజలి" నర్తించనని
నా కాలు అడుగు కలపదేం?

ప్రజల చేత ప్రజల వలన
ప్రజల కొరకు పరిపాలన
ఎవరు మాత్రం అవునంటారిక?

వూరు వదిలి వాడ వదిలి
వేల జనులు ప్రాణమిచ్చి
తర తరాల దాస్యం తొలగించి
నిరంతర స్వేఛ్ఛనిచ్చినా
ముందుకు కదలదే స్వతంత్రభారతి!

మనం కాదా కదలాలి ముందు?
జనసమూహంలో ప్రక్షాళన,
యువతరంగంలో స్వచ్చంద దీక్ష
కలిసి మెలిసి సాగినపుడు వెలువడదా
వసుధైక వేదనాదం?

వీరజవాన్లు అందించిన స్వేఛ్ఛాగానం!
జైహింద్ అని జాతిపతాకం నింగికెగయదా?

నిన్న కల కాదా నేటి నిజం.

నేటి యోచన అవదా రేపటి సత్యం!

మహావృక్షమైనా జనించాలి అంకురమై,

మహాశిఖరమైనా అధిరోహణ సంభవమే,

సంకల్పం బుద్దిబలం మన మార్గదర్శకం.

మనకు మనమే కావాలి ఆదర్శనీయం.

**************************************
ఫ్రెండ్స్, If your time permits my old works along these .....

"త్రిశంకు నరకం చూసొద్దామా? కాదంటే స్వర్గమొకటి కట్టేద్దామా"

"స్వతంత్ర గణతంత్ర యంత్రజీవన తాంత్రికులం!!!"

నాయిక నోరు విప్పిన వేళ..

కాలసర్పం కాళీయుడైన ఆ క్షణం
మర్ధించగ నందనందనుడు
అనురాగ క్షీరమధనం ఆ వైనం
మురిపించగ జగన్మోహనుడు
ఆమె లోకాన అతడు అనీషుడు

మౌనభాష్యాల మేఘసందేశాలు
కినుకలెరుగని చిరుదరహాసాలు
జీవనం వేదసమాన్వితం
సఫలీకృతాలు ఆ జీవితాలు
ఆమె నుడువగ అతడు ధీపతి

ఆమెయందు అష్టనాయికల చందం
లాలించువేళల నారిమనోవల్లభుడు
కవ్వించువేళల బహు చతురుడు
ప్రియమార ఆలింగనాల అతిరధుడు
ఆమెనబ్బురపరచు అతడు ధీరోదాత్తుడు

అధరాల అపురూప సవ్వళ్ళు
హస్తద్వయాలు సంకెళ్ళు
శుభఘడియల రేయిపవళ్ళు
సురగంగ తలవంచు పరవళ్ళు
ఆమె ముసినగవున అతడు రాజీవుడు

సింహమధ్యముని చిహ్నం ఆ శౌర్యం
ఆజానుబాహువు ప్రతీక ఆ రూపం
రవితేజమునరికట్టు ఆ యశస్సు
నిర్మల మానసమున అజాతశతృవు
ఆమె ముదమార అతడు మహిమాన్వితుడు

నాయిక హృదయమందిరాన బందీ ఈ నాయకుడు!!!

*********************************************
నా నాయిక-నాయక చరితార్థులు, ఒకరికొకరు ప్రేమాన్వేషణ మజిలీ. నేనున్నా లేకున్నా ఈ లోకాన అమరులు.

నాయిక భావనలు -
అష్టనాయికలూ నేనేనై, నీ ఒక్కడికై వేచానిట...
నాయిక మురిపాలు - నేనూ నండూరి ఎంకికేం తీసిపోను
నాయిక నివేదనలు - కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం!

అతడెవరు?

కాలసర్పం కక్కిన గరళం గతం
ప్రాణవిహీన
సదృశం జీవనం
అనురాగం పంచిన భాగ్యం ఆయుస్సు
కాలమిచ్చిన భవిత తన వరం
ప్రేమ పునర్జీవి ఆమె ప్రమద్వర

మౌనభూషితం ఓ మానసం
రాగరంజితం ఓ హృదయం
ఇరువురి యెడం ఓ విలాపం
సమాంతరాలు ఆ జీవితాలు
శోకతప్త తపోవనాన ఆమె ప్రవహిత

విరహాతిశయాలు విరజాజి వగపులు
వనమాలి వైనాలు వసంతకేళీలు
వయ్యారి అలకలు వలరాజు మురిపాలు
వనకన్నె విలాసం ఇల కన్న వైభోగం
వేవేల పలుకులల్లి వలపు చిలుకు ఆమె ప్రవల్లిక

వెన్న చిన్నబోవు మేని తాకిళ్ళు
తబ్బిబ్బుల నవ్వు లొలుకు అధరాలు
పరాజిత తనువు ప్రియుని తల్పం
పున్నమి రేయి అమాస చేరు సమాగమం
మహిలో దివ్య శోభల ఆమె పరవశ

కలువకాంత గుసగుసలు ఆ అందాలు
చంద్రకళ అరువడుగు ఆ చందాలు
సూర్యప్రభ చెలిమిచేయు ఆ సోయగాలు
నీలమేఘ శ్యాముని అభిసారిక ఆ యామిని
సంతృప్త సౌగంధి ఆమె పరిమళ

కనుసన్నల నాయికని చెరబట్టిన నాయకుడు, అతడెవరు?

******************************************
గమనిక: ఈ క్రిందివారు ప్రతీకలే కానీ పూర్తి సామ్యం లేదు పైన కవితలోని నాయిక రూపులకి.
ప్రమద్వర
ప్రవహిత

వెదురుపువ్వు రేకువిచ్చి నవ్వింది

మరువానికి నిత్యమల్లి కలిసింది-
మాట కలిపి మనసు విప్పి
ఎదను తడిమి ఒడిని చేరి
అద్వితీయ కదంబమొకటి సృజన చేసింది

మొగలిపువ్వు వెదురుపొదని వెదికింది-
విడిదిమ్మని ఉత్తరం వ్రాసిపంపి
మొలకనవ్వు వెదురుని వేణువుచేసి
మహతిమీటని సరాగం వెలికివచ్చింది

పిలవకనే ప్రేమ తలుపు తట్టింది
అడగకనే పూల పొదరిల్లు కట్టి
నవరాగంతో స్నేహగీతమొకటి తరంగమై
మొగలితావితో వెదురుపువ్వు రేకువిచ్చి నవ్వింది...!