సెలవురోజులొచ్చాసాయే బ్లాగు!

మరువం తాత్కాలిక విరామం తీసుకోనున్నదిక. వారం "థాంక్స్ గివింగ్" సెలవులు కనుక కాస్త బయట గాలిపీల్చుకోను వెళ్తున్నాను, ఆపై వృత్తిపర విషయమై తీరిక చిక్కదు కనుక తిరిగి పై శనివారం వరకు గప్ చుప్. ;)

విందులు [
టర్కీ , మాష్ పొటేటో, గ్రేవి, యాపిల్ పై వగైరాలు] వినోదాలు [స్నేహితులు, బంధువుల సమక్షం లో, సినిమాలు] లేదూ షికార్లు, విహార యాత్రల్లో [మా బాపతు] , ఊహు ఇవేమీ కాదు మాకు "షాపింగ్" పిచ్చి కనుక "బ్లాక్ ఫ్రై డే" చాలు అని - ఈ సెలవులు గడిపే అందరికీ ఆనందం, ఆహ్లాదం కలుగాలని మనసారా కోరుకుంటూ... ఇండియాలో, ఇతర ప్రదేసాల్లోని వారికి కూడా అవి చేకూరాలని ఆశిస్తూ...

తిరిగి విశ్వామిత్ర-౧౨ టపాతో డిశంబర్ ఐదారు తారీఖుల్లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ ...

మీ నేస్తం,
మరువం ఉష.

నవంబర్ నెలలో నేర్చిన పాఠాలు

*** వచ్చే వారం "థాంక్స్ గివింగ్ సెలవుల" వలన క్లాస్ లేదు. ఇవి నవంబర్ నెల పాఠాల వివరాలు.

తెలుగు పాఠాలు విదేశంలో పెరుగుతున్న పిల్లలకి చెప్తున్నవి కనుక దాదాపుగా వాళ్ళంతా అతి తక్కువగా తెలుగు మాట్లాడివుంటారు కనుక, పిన్న వయస్కులు కనుక పాఠాలు కాస్త క్రొత్తగా ఆట, పాటలు కలిపి చెప్తాను. ఈ విధంగా వాళ్ళలో క్లాసుకి రావాలన్న ఉత్సాహం కనపడుతుంది.

.. అక్షరమాల లోని అచ్చులు, హల్లులు అన్నీ పెద్ద పిల్లలు గుర్తించ గలిగి, పలికి, సరళమైన పదాలు, వాక్యాలు వ్రాయగలుగుతున్నారు.
ఉదా: గారెలు, నాకు పాలు కావాలి

.. మనం నేర్చుకున్నట్లుగా కాక కాస్త మార్పుతో నేర్పుతున్నాను.
ఉదా:
** సున్న వ్రాసి, దాన్నుంచి వచ్చే అక్షరాలు ఒక సమూహం లో - మ,య, ప, వ, అ, ఆ, ర ....
** డబ్ల్యు వ్రాసి దాన్నించి వచ్చే అక్షరాలు - చ, ఐ, ఉ, జ ...
** యెస్ వ్రాసి - క, క్ష

.. అక్షరాల తేడాలు తెలుసుకున్నారు. ఒకటి చెప్తే దానికి క్లోజ్ కజిన్ గురించి చెప్తున్నారు.
ఉదా: స, న; ప, వ; మ య

.. వత్తులు తెలుసుకున్నారు.

.. గుణింతాలలోని ఎక్సెప్షన్స్ దాదాపుగా గుర్తుపడుతున్నారు.
ఉదా: క -కు; ర - రు; వ -వు [మ అని ఎందుకు వ్రాయరు?]

.. వత్తులు, గుణింతాలు కలిపిన అక్షరాలు పలకటం, అవి వున్న పదాలు గుర్తించటం
ఉదా: స్నేహ, స్ఫూర్తి, జన్యా, అమ్మమ్మ, అన్నయ్య, నేర్పే...

.. చిన్నారులు [ఐదారేళ్ళ వయసు వారు] కూడా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.

.. ఇప్పుడు ఇద్దరిద్దరిని కలిపి టీం వర్క్ చేయిస్తున్నాను.

.. పాట:

- అమ్మ కు జై జై

.. కథ:
- చాలా చెప్పుకున్నాం. మీకు అవన్ని చెప్పం. ;)విశ్వామిత్ర-11

మిత్ర అమెరికాకి తిరుగు ప్రయాణం నాలుగు రోజుల్లోకి వచ్చేసింది. సర్దుకోవటం మొదలుపెట్టిందే కానీ మనసులో ఏదో దిగులు. సుబ్బాలు దగ్గరగా కూర్చుని అన్నీ అందిస్తుంది. అనంత మరో గంటలో వస్తున్నానని కబురు పంపింది. కాసేపు విశ్రాంతిగా కూర్చోవాలనిపించి చేతిలో పనాపి నాన్నమ్మ దగ్గరికి వెళ్ళింది.

చదువుతున్న పుస్తకం ప్రక్కన పెట్టి, మిత్రని దగ్గరకి తీసుకుని "అమ్మలు! తాతగారు తెచ్చిన షాల్ పెట్టుకున్నావా?" అని అడిగారు.

"ఊ," అంటూ
"నానమ్మా! వెళ్ళాలనిలేదు." గోముగా అంటూ ఆవిడ వొళ్ళో తల పెట్టుకుని చిన్న పిల్లలా ముడుచుకుని పడుకుంది.

కాసేపు తలనిమురుతూ వుండిపోయారు. చెప్పనవసరం లేకుండానే ఏవో మాటలు ఆ మనసునుండి ఈ మనసుకి చేరిపోతున్నాయి.

"అది నీవు ఎంచుకున్న జీవితం తల్లీ. దూరాభారాలు, రాకపోకలు ఎప్పుడూ వున్నవే. దిగులు పెట్టుకోకు మరి. నీవెక్కడ వున్నా రాణించేస్తావు, మా అమ్మలు వరాలమూట" బుగ్గలు పుణికిపుచ్చుకున్నారు.

"సుబ్బాలు, ఇలారా. రేగివడియాలు పెట్టావా?" అని కేకవేసి అడిగారు.

"ఆయ్, మర్చిపోతే మిత్రమ్మ వూరుకుంటుందా." అంటూ వచ్చింది.

ముగ్గురూ మాటల్లో పడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా కొన్ని కబుర్లు ఇంకా వినాలనేవుంటుందేమో, గది గుమ్మం దగ్గర కూర్చుని మిత్రని మళ్ళీ అడిగిన మాటలే అడుగుతున్న సుబ్బాలు ఏదో అలికిడికి వెనక్కి వంగి ప్రక్కగా చూసి "అనంతమ్మ వచ్చారు." అంటూ లేచింది.

"రామ్మా, దేవబాబు రాలేదా?" అని అడిగారు లక్ష్మీదేవమ్మ గారు.

"లేదమ్మమ్మా, పనుల రోజులు కదా, మీకు తెలియనిదేముంది." చిన్నగా నవ్వుతూ మిత్ర ప్రక్కన కూర్చుంది.

"పద వదినా నా గదిలోకి వెళ్దాము." మిత్ర లేచి అటుగా దారితీసింది.

ఇద్దరూ కూర్చున్నాక చేతిలో పాకెట్ విప్పి "మిత్ర, విశ్వకి ఇష్టమని కాస్త చికెన్, ప్రాన్స్ పచ్చళ్ళు తెచ్చాను. వీలవుతుందా?" అని అడిగింది.

"అ.." అనబోయిన సుబ్బాలుని కళ్లతోనే వారించి "అలాగే వదిన. దానికేముంది." అంది.

"వాడూ వస్తే బాగుండునని నాన్నగారు, నేను అనుకున్నాము. ఇన్ని నెలలు చూడకపోవటం మాకూ ఇదే మొదలు." అంది అనంత.

ఈసారి పాకెట్లోంచి చీర ఒకటి తీసింది. "నేనే వర్క్ చేసాను. నీకు ఈ రంగు బాగుంటుందని అమ్మమ్మ నేను ఇద్దరం వెళ్ళి కొన్నాము." అంది విప్పి చూపిస్తూ.

పట్టుకుంటే మృదువుగా వున్న పాలపిట్ట రంగు చీర మీద పెయింటింగ్. "చాలా బాగుందొదినా." అంటున్న మిత్రని తదేకంగా చూస్తున్న అనంత "మిత్ర ఒకమాట అడగనా?" అని అడిగింది.

ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. ఏమడుగుతుందో అనుకుంది.

"విశ్వ చాలా తక్కువగా మాట్లాడతాడు. ఈమధ్య రెండు, మూడు సార్లు తన మాటల్లో నీ గురించి ఏదో ఒకటి చెప్పాడు." పది సెకన్లాగి "మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా?" అంది.

ముందు చిరుకోపం. ఏమని చెప్పివుంటాడు. తనతో ఏమీ చెప్పలేదింకా అనుకుంది లోలోపల.

"అది వదిన మరి .." ఏదో బిడియం. "తర్వాత మాట్లాడదాం" మాట తప్పించేసింది.

"సరే నాకు తెలిసిపోయింది కథ. వాడేమీ చెప్పలేదు. నేనే వూహించాను. వాడు అంత త్వరగా బయటపడే రకం కాదు." నవ్వేస్తూ "మీరెప్పుడు సిద్దంగా వుంటే అప్పుడే చెప్పండి." అంది అనంత.

"వదినా నిజానికి నాకు మీ నాన్నగారి గురించి విశ్వ చెప్పినపుడు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. తన విషయం కూడా చెప్పాడు." నెమ్మదిగా అంది మిత్ర.

"అవును మిత్ర. నాకు నాన్నగారి జీవితాశయాలు, ఆయన వాటి పట్ల చూపిన నిబద్దత చాలా ఇష్టం," అంటూ "దశరథ్ గారి అమ్మాయి అన్న ఆ గౌరవం ఎంత ఆనందాన్ని ఇస్తుందో." అంది అనంత.

తిరిగి తనే పొడిగిస్తూ "చిన్నాడు రఘురామ్ కి కొంచం అటూఇటూ వచ్చినా, విశ్వ మీద మాత్రం అంతా ఆ నాన్న పెంపకం, ప్రభావం పూర్తిగా పడ్డాయి. ఒక్క మృదుస్వభావం తప్ప. అది మాత్రం వాడి సహజ తత్వం. అలాగే ఆ మితభాషణం కూడా." అంది.

అలా అలా వాళ్ళ వూరి కబుర్లు, చిన్నప్పటి సంగతులు చెప్తుండగానే సాయంత్రమైపోయింది. "జాగ్రత్తగా వెళ్ళిరా మిత్ర. మళ్ళీసారి నాకు శుభవార్త వినిపించాలి." అని మరి మరీ చెప్పి వెళ్ళింది.

*************************************************

అనంత అలా వెళ్ళిందో లేదో ఇలా నవీ రానే వచ్చింది. ఆ రాత్రికి నవీని తన దగ్గర వుండటానికి రమ్మంది. పిల్లలిద్దరినీ తల్లికి అప్పజెప్పి ఒక్కతే వచ్చింది.

మిత్ర స్నానం చేసి వస్తానని లేచివెళ్ళింది.

"నానమ్మా! ఏమి వండుతున్నారు మాకు." అంటూ చొరవగా వంటగదిలోకి వెళ్ళింది నవీ.

పావుగంటకి మిత్ర రాగానే, ఇద్దరూ డాబా మీదకి దారి తీసారు. అలా ఎన్ని రాత్రులు అక్కడే కొబ్బరాకు వీవెన్ల నడుమ బూరుగు పరుపుల మీద పడుకుని పైన ఎగిరే చిలక బాతుల సన్నని గజ్జెల మోతవంటి సవ్వళ్ళు వింటూ, మినుకు మినుకుమనే తారల్ని చూస్తూ, కబుర్లతో సగం రాత్రి గడిపేసేవారో.

సన్నజాజి మొగ్గల పళ్ళెం ముందేసుకుని సూదికి ఒక్కో మొగ్గ ఎక్కిస్తూ, నెమ్మదిగా దండలోకి సవరిస్తూ "ఊ ఇప్పుడు చెప్పు. ఏమిటో 'సంఘ' మిత్ర పనులు చేస్తున్నావట." అని ధీర్ఘం తీసింది నవీ.

చిన్నగా విచ్చుకున్న పెదాలతో నవ్వేస్తూ "సుబ్బాలు చెప్పేసిందా" అంది.

"మరి, నేను ఆమ్లెట్ తింటేనే మొహం అదోలా పెడ్తావు. ఇప్పుడేమో ఏకంగా పెట్టెలో సర్దుకున్నావట అనంతక్క ఇచ్చినవేవో.." ఇంకాస్త ఉడికిస్తూ అంది. "ఏమిటీ కథ. కాస్తేదో సుబ్బాలు మోసింది కానీ." అని మిత్ర మొహంలోకి పరీక్షగా చూసింది.

నవీ చెయ్యి తన చేతిలోకి తీసుకుని "నవీ నువ్వు కాస్త సీరియస్ గా వున్నావని ఆగిపోయానే. నాకే స్పష్టతలేక నీకు ఏమని చెప్పాలో తెలియక మరి కాస్త ఆగాను" అంది మిత్ర.

గుచ్చిన దండ మిత్ర తల్లో తురుముతూ "ఊ, అమ్మడి విషయం తెలిసిందే. ఇప్పుడా విషయమై ఎన్ని నెలల నించి చించుతున్నావు?" అంది నవీ.

మిత్రాకి ఆలోచనలు ఎక్కువని, ప్రతి విషయాన్నీ తరిచి తరిచి శోధిస్తుందని ఆలోచించటాన్ని అలా "చించుతున్నావు" అని ఆటలు పట్టించటం అలవాటు నవీకి.

"పోవే, చెప్పటానికేమీ లేదు." అంది మిత్ర. ఆ ఇద్దరి నడుమ స్నేహానికి అంతకన్నా వివరాలు అక్కరలేదు.

"అసలు మునుపు కదిపాక వద్దనుకున్నది కదా. మరి ఇదెలా సంభవం?" కాస్త ఆశ్చర్యం కలిపిన కుతూహలం ద్వనించే గొంతుతో అడిగింది నవీ.

నిదానంగా అన్నీ చెప్పుకొచ్చింది. మధ్యలో సుబ్బాలు తీసుకొచ్చిన పుణుకులు అల్లం పచ్చడి లో అద్దుకుని మిత్రకి కూరుతూ తనూ తింటూ వింటూవుంది నవీ.

"బాగుంది. విశ్వామిత్రం - అపురూపం, అమోఘం.." అంటూ గలా గలా కొబ్బరాకులా నవ్వుతున్న నవీ ని చూస్తుంటే ఏదో ఆనందం. తను వచ్చినప్పటికి, ఇప్పటికి ఎంత మార్పు. తిరిగి మామూలు మనిషైంది అనుకుంది.

"మరి మా మిత్ర మనసు దోచినవాడు మాటకారేనా?" అన్న నవీ మాటలతో విశ్వ మౌనం ఆ మౌనం తనలోపలికించే గానం గుర్తుకొచ్చాయి.

"ఊహు, మరీ మొహమాటస్తుడు. మాటలు కొలిచి ఆచి తూచి వాడతాడు." అని నవ్వేసింది.

దాదాపు తెల్లావారిపోయే వరకు ఇద్దరూ పాత, క్రొత్త వూసుల్లో మునిగిపోయారు. మధ్యలో భోజనానికి ఓ అరగంట మాత్రం క్రిందకి వెళ్ళివచ్చారు.

తెల్లవారి వెళ్ళే రైలు శబ్దానికి, ఆకాశం లో వెలుగుతున్న వేగుచుక్కని చూస్తూ "వేగు చుక్క పొడిచింది. వేకువ కాబోతుంది. గాలిలోన తేలేనాదం మేలుకొలుపు పాడింది." అప్రయత్నంగా ఇద్దరూ ఒకేసారి పాడుతూ నవ్వేసారు.

నవీ నిద్రలోకి జారుకుంది. మిత్రకి మనసు నిండా విశ్వ నిండిపోయాడు.

'నీ జ్యేష్ఠకుమారున్నాకు
ఇమ్ము దశరథా' అని అడిగేస్తే ఎప్పుడో విన్న భక్తిగీతం పెదాల మీద పలికింది. ఆ వెనుకే ఓ మొలక నవ్వూ విచ్చింది.

తన చుట్టూ వున్న నవీ చెయ్యి నెమ్మదిగా జరిపి, లేచి గోడ దగ్గరగా నిలబడి, క్రింద నుండి పాకించిన విరజాజి తీగె మీద చెయి వేసి సవరిస్తూ, ఆ సువాసనలు అఘ్రాణిస్తూ వుండిపోయింది. వీళ్ళందర్నీ వదిలి వెళ్ళాలన్న దిగులు వున్నా, అతని దగ్గరకి తిరిగి వెళ్తున్న ఆనందం మనసుని తేలికపరుస్తుంది. అతని తాలూకు వూహలు విరజాజులకి మల్లేనే ఆమె మదిలో మధురిమలు వొలికిస్తున్నాయి.

**************************************************

మర్నాటికి సురేంద్ర, కస్తూరి వచ్చారు. వచ్చిన వారానికి తల్లీ, తండ్రుల దగ్గరకి వెళ్ళి పదిరోజులు గడిపివచ్చింది. ట్రాన్స్ఫర్స్ మీద తిరగటం వలన అదీ క్రొత్త వూరు కావటంతో ఓ వారం గడవగానే మళ్ళీ నానమ్మ వూరు మీద ధ్యాస మళ్ళిపోయి తిరిగి వచ్చేసింది.


మళ్ళీ హడావుడి. అందరిలో తెలియని దిగులు. పైకి చూపితే ఎదుటివారు బాధ పడతారని ఎవరికి వారే గుంభనగా వున్నారు.

సుబ్బాలు మాత్రం అప్పుడప్పుడు కొంగుతో కళ్ళు అద్దుకుంటూ బయటపడిపోతుంది. అజ్జి తాత లేవటం లేదని తెలిసి ఓ సారి వెళ్ళిచూసివచ్చింది. మద్యపానం వలన దెబ్బ తిన్న ఆరోగ్యం ఇక కోలుకోలేడేమోననిపించింది. జాగ్రత్తలు చెప్పి వద్దన్నా మందులకి డబ్బు చేతిలో పెట్టి, భాసికి కూడా ఓ మాట చెప్పి వచ్చింది ప్రయాణం ముందు రోజు.

తర్వాత అంతా వేగంగా సుడిగాలి మాదిరి గడిచిపోయింది.

**************************************************

ఒంటరి ప్రయాణం విసుగ్గానే వుంది. విశ్వ కి బయల్దేరేముందు ఫోన్ చేసింది. మిత్ర ఆఫీస్ లోనే వుండటం వలన తను రిసీవ్ చేసుకుంటానని చెప్పాడు. అదీకాక తన ఇంటి తాళాలు అతనికే ఇచ్చివచ్చింది. లాండింగ్ ఆనౌన్స్మెంట్ వినగానే కాస్త రిలీఫ్. మరో గంటకి లోపల ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి బయటకి చేరే సరికి, విశ్వ ఎదురు చూస్తూ వున్నాడు.

చిరునవ్వే అతని పలకరింపు. ఆ నవ్వులోనే ఎన్నో కుశలప్రశ్నలు.

సామాను బూట్ లో పెట్టాక, మిత్ర కూర్చున్నాక, తను కూడా డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక కుడిచెయ్యి చాపి, మిత్ర ఎడమ చేతిని తన చేత్తో బందిస్తూ "మిత్ర, ఐయామ్ సో హాప్పీ. మిమ్మల్ని బాగా మిస్సయాను." అన్నాడు.

ఆ స్పర్శలోని ఆత్మీయతని అలా అస్వాదిస్తూ వుండిపోయింది. మునుపటి జంకు అతనిలో లేదు. మిత్రలోనూ అదేదో చాలా సహజంగా జరిగిపోయిన చర్య మాదిరి ఫీలింగ్. వెచ్చని వెడల్పాటి అతని చేతిలో అరిటాకు సుతిమెత్తని ఆమె చెయ్యి పూర్తిగా ఇమిడిపోయింది. ఏదో అనుభూతి తాలూకు శక్తి ఇద్దరిలోనూ ఒకే విధంగా నిండిపోయింది.

"విశ్వ, నాకిలా మిమ్మల్ని తిరిగి కలవగానే చెప్పలేని ఆనందం." మిత్రకి అప్పుడు స్ఫురించింది విశ్వ నే ముందు మనసు విప్పాడు. ఆ భావన తాలూకు ఉత్తేజం మరింత నింపింది.

అలా సాఫీగా సాగిపోతున్న ఆ కార్ లో అతని ప్రక్కన కూర్చుంటే జీవితం ఇలాగే నడిచిపోతే ఎంత హాయిగావుంటుంది కదా అనిపించింది.

ఇండియా కబుర్లు చెప్పుకుంటూ మూడు గంటలు ప్రయాణం ముగించి మిత్ర ఇంటికి చేరారు. మధ్యలో ఆపుతానన్నా వద్దని వారించింది. గాస్ స్టేషన్ లో పాలు మాత్రం కొన్నారు.

ప్రయాణపు బడలికని అతని సమక్షం మరిపిచేస్తుంది. విరహం, తిరిగికలవటం అప్పుడే తనకి అనుభవంలోకి వచ్చేసాయి.

"మరిక నేను వెళ్ళనా?" అతని ప్రశ్నకి తల అడ్డంగా వూపుతూ "ఊహూ, ఈ రాత్రికి వుండిపోండి. ఇప్పుడేగా వచ్చాను." మారాంగా అడిగింది.

తమ మధ్య ఇలా సంభాషణకి మిత్రకీ లోలోపల ఆశ్చర్యం, ఎందుకు తనిలా తపించిపోతుంది. అతన్ని వెళ్ళనీయాలని ఎందుకు లేదు. ఇంకేదో అడగాలని, చెప్పాలని ఎందుకు అనిపిస్తుంది?

"సరే అలాగే కానీ మీకు విశ్రాంతి కావాలి. నేను ఉదయాన్నే వస్తాను." అని "వెళ్ళేదా?" అని అడిగాడు.

"మరదే నాకు కోపం తెప్పిస్తున్నారు." మిత్ర గొంతులో అలక. విశ్వ దృష్టి దాటిపోని మరో విషయం మిత్ర కోపంలో చూపు కాస్త క్రిందగా నిలిపి, కుడిపాదం బొటనవ్రేలు నేలకి నొక్కి పట్టి చక్రాలు చుడుతుంది.

'ఎంత ముద్దుగా వుందో ఆ భంగిమ. సత్యభామ ని తలపుకి తెస్తూ' అని ఒకడుగు మిత్ర వైపు వేసాడు.

అదే సమయానికి ముందుకు కదిలిన మిత్ర దాదాపుగా అతన్ని హత్తుకున్నంత చేరువకి వచ్చింది.

అప్పుడు జరిగిందది. యుగాల తరబడి స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ పునాదిగా జనించే ఆకర్షణ. అది శారీరక వాంఛ కాదు. కానీ ఒకరిలో ఒకరుగా వొదగాలన్న భావన. మిత్ర అతని చుట్టూ చేతులు వేస్తూ దగ్గరగా జరిగింది. అతని ఛాతి మీద తలపెట్టి అలా పట్టుకుని వుండిపోయింది. విశ్వ లో ఏదో తెలియని ఉద్వేగం, అనుభూతి, ఆనందం, అన్నిటి కలపోత. ఇంకా కమ్ముకుపోవాలన్న తపన.

మనసావాచా కలవనున్న ఆ ప్రేమికుల ఏకీభావ గానమిది.

మనం ఒకరికొకరం వరాలం.
తరతరాల ప్రేమ చరిత్ర ఇది.
మనం మనకు అపురూపాలం.
ఇహపరాల ఆత్మ సంయోగమిది.

అగ్నిపునీత - ఆత్మవంచన

అగ్నిపునీతవి కమ్మని నిను నిలదీసిన మగని
నీ ప్రేమజ్వాలలో ప్రక్షాళనకమ్మని అడగవైతివి.
మారు ప్రశ్నలేయక స్త్రీ ఆత్మాభిమానానికి చిహ్నమైతివి.
యుగయుగాలు తరిచినా తరగని ఉన్నతిని పొందితివి.
నీవు లేని సీతారాముడు ఇనకుల యశస్వి కాగలడా?

ఉపరితలాన దావానలమై, కడలి గర్భాన బడబానలమై
చెలరేగినా అవని మీద అంగుళంమైనా దహించలేని అగ్ని,
అయోనిజవి నిన్ను తాకలేని అబలుడు కాదా?
నిజానికి నీ పాదస్పర్శతో పునీతుడు అయింది ఆ అగ్నే కాదా?
అమ్మని మించిన క్షమచూపగ మహిలో మణిపూసవి నీవుకాదా?

ఎవరికి ఆదర్శమని మరల నిన్ను కారడువుల పాల్చేసాడు?
నిండు చూలాలివి ఎంత మనోనిబ్బరాన తరలివెళ్ళితివి!
నిను ఎడబాసి అశ్రుకడలిలో శోకతప్తుడాతడైతే,
కవలల పెంపకాన మునిగితేలిన ధీరోదాత్తురాలివి నీవైతివి.
వాల్మీకి రామాయణ అగ్రతాంబూలం నీకు కాదా తగినది?

ప్రేమిక నిను తనరూపుగ నిరతం నిలుపలేదా?
రామునికై అనురాగకోవెల నీ హృదయమె కాదా?
ఆత్మసౌందర్యాన నీకు ఉపమానం ఎవరమ్మా జానకమ్మా?
మాయాసీతగా నీ రూపు లోకానికి చూపగ ఒరిగినదేమి?
తన పడతిని పతితగ ముద్రవేసిన లోకానికి అతను చూపినదేమిటి?

వనవాసాలు, అసురుని చెరలు, ఆశ్రమజీవనాలు, అంతఃపుర దాపరికాలు
ఎన్ని విధాలు నీ సహనానికి పరీక్షలు?
నీ మనసున నిలిపిన మూర్తిని నీవు విడనాడినది ఎప్పుడు?
విరహాన, విలాపాన ఆతని స్మరణ మరిచినది ఎపుడు?
గుణగణాలు ఎన్ని గణించినా ఆత్మవంచన చేసుకున్నది ఎవరిట?

మంచు కురిసిన మోహనం

ఆమని పైనా, అవని పైనా
ఆ ఇరువురినీ మించిన అతివలపైనా?
మంచు కురిసినా, మబ్బు కమ్మినా,
నడివేసవి వడగాలి విసిరినా...

 
ఒకరికొకరైన ఆ ఇరుహృదయాలు
ఆలాపించవా వలపు రాగాల నవ గీతాలు

 

ఎవరికో విసిరేది అ మంచుపోగుల వలలు,
ఆకాశ రాజు మొదలిడిన ఆకతాయి పనులు?

గాజుల గలగల గాలులు చేస్తుంటే,
జాజుల మధురిమ వెన్నెల తెస్తుంటే,
మోజుల మురిపాలు తనువులు మోస్తుంటే,
ప్రకృతీకరమైన సమ్మోహనవేడుకల సందళ్ళతో...

విశ్వామిత్ర-10

మిత్ర అమెరికాకి వచ్చి రెండున్నర యేళ్ళు అయిపోయాయి. ఒక్కసారి తాతగారి వూరు వెళ్ళి రావాలన్న ధ్యాస పెరిగిపోయింది. ప్రయాణం పెట్టుకుంది. సెలవులన్నీ కలిపి నాలుగు వారాలకి వెళ్ళిరావటం.

వర్క్ లో క్లీన్ రాప్ అప్ చేసి హాండ్ ఆఫ్ చేయటం, కాస్త షాపింగ్, సర్దుకోవటం. దాదాపుగా ఒక నెల కాలం హడావుడిగా గడిచిపోయింది.

విశ్వ ఈ మధ్య రానూ లేదు ఒక మూణ్ణెల్లుగా, ఈ నెలగా పెద్దగా మాట్లాడుకోనూ లేదు. అతను ఎప్పటిలానే ఫోన్ చేయటానికి చొరవ చేయకపోవటం, తనకి కుదరకపోవటం ఓ కారణం. ఈ-మెయిల్స్ మట్టుకు వారాకొకసారన్నా అటు ఇటు వెళ్తున్నాయి.

శనివారం ప్రయాణం. శుక్రవారం రాత్రి అతనికి ఫోన్ చేసింది.


"విశ్వ!ఈ సారి మీరు ఇక్కడకి వచ్చినపుడు నేను వుండను" మిత్ర మాటల్లో దాగని దిగులు.

అటునుండి నిమిషంలో సగం సేపు పాటు మౌనం. "అవును మిత్ర, అక్కడ ఎక్కువ ప్రయాణాలు వున్నాయా?" మాట మారుస్తూ అడిగాడు.

"పెద్దగా లేవు, నవీ కూడా అటునుండి చంటిపిల్లలతో వస్తుంది. తాతగారి దగ్గరే మకాం. దిగగానే ఎలాగూ విష్ణుని కలుస్తాను." అంది.

"అక్కడనుండి ఏమైనా కావాలా" తనే అడిగింది. "సరదాగా గడిపిరండి." అన్నాడతను.

అలా పొడి పొడిమాటలే ఆ కాల్. ఎదురుబొదురుగా వుంటే కాస్త నయం. కనీసం "ఐ మిస్ యు" అనన్నా అనలేదు. కాస్త కినుక వచ్చింది. అంతలోనే నవ్వూ వచ్చింది. తానింకా అతనితో తన మనసులోని మాట చెప్పనిదే అసలే బిడియస్తుడు అంత త్వరగా బయటపడతాడా!

*************************************************

ప్రయాణం సాఫిగానే జరిగిపోయింది. మూడో నాటికి ఇల్లు చేరింది. సురేంద్ర, కస్తూరి కూడా హైదరాబాదు లోనే రిసీవ్ చేసుకున్నారు. మాధవయ్య గారి లోగిలి కళకళలాడుతూ మిత్ర రాకకి మురిసిపోతుంది.

లక్షిదేవమ్మ గారి హడావుడి ఇంతా అంతా కాదు. గుమ్మంలోనే కొబ్బరికాయ దిష్టి తీయించిపడేసారు. సుబ్బాలు సంబరం దాగని కళ్ళతో మిత్ర ని అలా తడుముతూ కబుర్లాడుతూ కూర్చుండిపోయింది.


"అమ్మలు, బడలిక తీరుతుంది కాస్త వేడి నీళ్ళతో నలుగుస్నానం చేయి తల్లీ." నానమ్మ మాటకి తలాడిస్తూ లేచివెళ్ళింది.

సాంబ్రాణి వేస్తూ అడిగింది సుబ్బాలు "మిత్రమ్మా! బారెడు జుట్టు ఇలా మూరెడు చేసేసావేమ్మా?"

చిన్నగా నవ్వింది మిత్ర. "అక్కడ జుట్టు దానం చేయొచ్చు. ఇక్కడ మనం మొక్కుకుని ఇవ్వమా అలాగే అక్కడాను. ఓ మంచి పనికోసం కత్తిరించి పంపాను" అంది.

కాస్త ఆశ్చర్యం దోగాడే కళ్ళతో సుబ్బాలు ఏదో అనేలోపే తనే చెప్పింది "కాన్సర్ వచ్చిన చిన్న పిల్లలకి తలకి విగ్స్ చేయటానికి జుట్టు తీసుకుంటారు. నేనొక అడుగు బారు తీసి పంపాను."

బుగ్గలు పుణికి "మా బంగారు తల్లి. ఈ మంచితనం మాత్రం మీ నానమ్మదే మిత్రమ్మ. " అంది సుబ్బాలు.

ముందు రెండు రోజులు వచ్చే పోయే వారితో ఓపిగ్గా కూర్చున్నా మూడో రోజుకి కాస్త నీరసపడిపోయింది మిత్ర. మంచం దిగబోతూ ముందుకు తూలింది. సుబ్బ ఆసరాతో ఆగింది. ఆ క్షణం ఒక్కసారిగా విశ్వ గుర్తుకు వచ్చాడు.

సాయంత్రం నుండి కాస్త మబ్బు కమ్మిన ఆకాశం వర్షించటం మొదలుపెట్టింది. మంచం మీద సాగిలపడి అలా నేల మీదకి జారుతున్న ఆ వాన చూస్తుంటే, ఏదో పరవశం.


ఆకాశం కడలిని దోచి దాచిన వలపులు, వాన కన్నె వనరాజుకి రాయబారం పంపుతున్నట్లున్న చినుకు పలుకులు. చిగురాకు వూయలూగి, చిటపట చిందులేస్తున్నాయి. ఆ కన్నె వగలు తనవేనేమో. తన వనరాజు - విశ్వ. చిరుసిగ్గుతో తనువంతా జలదరింపు. ఎడం చెయ్యి చాపి వాన బొట్లు పట్టి, ఆ తడి మీద కుడిచేతి వేలుంచి "విశ్వామిత్ర" అని వ్రాసుకుంది.

ఆ రాత్రంతా వాన అలా కురుస్తూనేవుంది. మాగన్ను నిద్రలో కల.

'మునిమాపు వేళ. తమ వూరి తామర చెరువు ప్రక్కగా వున్న పళ్లతోటలో ఫార్మ్ హౌస్ ముందు పట్టెమంచం వేసుకుని పడుకున్న తాను, దూరం నుండి ఆ చెరువు ప్రక్కగా సైకిల్ తొక్కుతూ వస్తున్న విశ్వ. తన దగ్గరగా అతను వచ్చేసరికి తను లేచి కూర్చుని ఏదో నవ్వుతూ చెప్తుంది. చాపిన అతని చేతిలో తామరాకులో చుట్టిన మల్లెలు. అతని వెనగ్గా గంతులేస్తున్న ఎర్ర ఆవు దూడ. మంచం ప్రక్కన దోరకాయల గుత్తులతో బరువుగా వాలివున్న జామ చెట్టు. తన ప్రక్కన కూర్చున్న అతని శ్వాస తన మెడ వంపున సెగలా తాకుతుంది.'

చెదిరిన కలతో పాటు మెలుకువ.


"సుబ్బాలు" అంటూ పిలవగానే ఆ గదిలోనే ప్రక్క వేసుకున్న సుబ్బాలు వెంటనే పలికింది.

"అలా తోటలోకి వెళ్ళివద్దామా?" అడుగుతున్న మిత్ర ని చిత్రంగా చూసింది. "ఇప్పుడా మిత్రమ్మా! తెలవారిందిప్పుడే. నానమ్మ గారింకా లేవనే లేదు." అంది.

"నిద్ర పట్టదింక. పద" అంటూ దిగింది.

మరో పావుగంటకి బ్రష్ పూర్తి చేసి, చుడిదార్ లోకి మారి, సుబ్బని వెంట పెట్టుకుని బయటకి వచ్చింది. ఈ లోగా లేచిన మాధవయ్య గారు "జాగ్రత్త" అని చెప్పి "వెనక బాసి వస్తాడు" అన్నారు.

*************************************************

నెమ్మదిగా నడుస్తూ, తోట చేరటానికి మరో ఇరవై నిమిషాలు పట్టింది. మధ్యలో రైలు కట్ట దాటుతూ ఆ గేట్ దగ్గర ఆగివున్న స్కూటర్ మీద కనిపించిన దేవేంద్ర అన్నయ్యని చూడగానే సంతోషంగా పలకరించింది.

"వచ్చావని తెలిసిందమ్మా. వదినని వాళ్ళ వూర్లో నిన్నే దింపివచ్చాను. పనుల రోజులు కదా. కాస్త కూలీల్ని పురమాయించి ఆనక అటువద్దామనుకున్నాను" అన్నాడు.

ఓ ఐదు నిమిషాలలా కుశలప్రశ్నలు, క్లుప్తంగా మాటలు జరిగాక మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోయాడతను. వదిన మరో వారంలో వస్తుందట. కలవాలి అనుకుంటూ కదిలింది.

కలలో కనపడిన ఆ స్థలానికి రాగానే విశ్వ కళ్ళ ముందు దోగాడుతున్నాడు. ఇవన్నీ తనకి చాలా ఇష్టమైనవి, ఆ తోట, జామచెట్టు, అలా మునిమాపు వేళలు, విరిసే మల్లె మొగ్గలు, వాటితో పాటుగా ఇప్పుడు అతను.

"ఏమిటి మిత్రమ్మా, పరాగ్గా వున్నావు? దిష్టి తగిలి వుంటది." సుబ్బాలు గొంతులో కాస్త ఆదుర్దా మరింత ఆపేక్ష.

"పో అన్నిటికి అలా ముడిపెడతావు" ముద్దుగా విసుక్కుంది మిత్ర.

తన వాళ్ల మధ్యలో ఇలా తన మనసైన వాడి ధ్యాసలో అన్నీ మరిచి కాలమిలా ఆగిపోతే? ఆ కల నిజమై సాగిపోతే. వెచ్చని ఆవిర్లతో మొహం కందింది.

ఆ క్షణం తన ఉద్యోగం కానీ, అమెరికా కానీ, ఏమీ గుర్తుకు రావట్లేదు.


*************************************************

మరో రెండు రోజులకి అత్తగారి వూరు వెళ్ళిన నవీ వూర్లోకి వచ్చింది. ఒకరినొకరు చూసుకోగానే ఇద్దరికీ కళ్ల నిండా నీళ్ళు. ఓ రెండు నిమిషాలు మాట్లాడుకోలేదు. కాన్పు జరిగి ఆరు నెలలలోపే కనుక కాస్త వొళ్ళు చేసినట్లే వుందింకా. కవలలు, ఒక పాప, ఒక బాబు. ముద్దుగా, బొద్దుగా వున్నారు. పోలికలు వెదుకుదామన్నా తెలియటం లేదు.

"నవీ! మీకిద్దరు మీరిద్దరు భలే.." అంది మిత్ర.

నవీ కళ్ళలో ఏదో దిగులు. మొత్తంగా ఏదో మార్పు. గలగల లాడుతూ వుండే తను కాస్త నిదానించినట్లుంది. కదపనా మాననా అనుకుంది.

"మిత్ర, నీతో మాట్లాడాలే. " తనే ఎత్తింది.

"ఊ చెప్పు. నీ నాధుని గాథలు" కాస్త నాటక ఫక్కీలో అంది.

"ప్చ్, నా జీవిత గాథ ఇది." నిరాసక్తంగా అంటున్న నవీ మాటలో సీరియస్ నెస్ అప్పుడు గమనించింది.

"భరత్ కోసం నా అంత నేను ఎంతో మారాను. ఇప్పుడదంతా పిచ్చితనమనిపిస్తుంది. నాకు తెలియకుండానే నా రెండో వర్షన్ నేను సృష్టించుకున్నాను. నా అసలు నన్ను దాచేసాను. అతని ఇష్టాలు నావిగా అతని ఆనందం నాదిగా అనుకున్నాను." అంటున్న నవీ క్రొత్తగా కనిపిస్తుంది.

"నవీ, ఇవన్నీ నువ్వు అమిత ఇష్టంతో అలవరుచుకున్నవేగా. అతని వత్తిడేమీ లేదు కదా?" మిత్ర కాస్త సంశయంగా అడిగింది. ఇంకా జరినదేదో తెలియదు. అలాగని నవీని గుచ్చి గుచ్చి అడగటం భావ్యం కాదు.

"భరత్ ది చాలా ఇండివిడ్యుయల్ పర్సనాలిటీ. తను తన అనుకున్నదే కానీ నాకోసం ఏ ఒక్కటీ మార్చుకోలేదు. కనీసం ప్రెగ్నన్సీ సమయంలో కూడా అంతే. పైగా నేను అలా అడిగితే 'అలా మారటం నాకు నచ్చదు. మన మధ్య ప్రేమకి అది యార్డ్ స్టిక్ కాదు' అంటుంటాడు." నవీ మాటలకి చూఛాయగా సంగతి అర్థమైంది.

'పోస్ట్ నేటల్ డిప్రెషన్ కానీ ఐడెంటిటీ క్రైసిస్ ' కావచ్చిది. బహుశా భరత్ వృత్తిపర వత్తిడిలో వుండీ నవీని కాస్త అలక్ష్యం చేయటమో, నవీకి అతనలా ఏ ఒక్క విషయమూ మార్చుకోకపోవటం కాస్త మనస్తాపం కలిగించివుండవచ్చు అని అనుకుంది.

దాదాపు మరొక రెండు గంటల పాటు మిత్ర అనునయంగా చెప్పిన మాటలతో నవీ తేలిక పడినట్లే అనిపించింది. కాస్త తేటపడ్డ మొహంతో నవ్వుతూ వీడ్కోలు ఇచ్చింది. మళ్ళీ వస్తానని ఇంటికి బయల్దేరింది.

నవీ ని ఒకటి రెండు రోజులు ఒక్కదాన్నీ కాసేపు ఒంటరిగా బయటకి తీసుకెళ్ళి తన మనసులో కమ్ముకున్న ఆ సందేహాలు తీసేయాలి. నిజానికి ఇది భరత్ గ్రహించి చేయాలి కాని అతనితో తనకంత చనువు లేదు కనుక తన వంతు తాను చేయాలి.

తమ కుటుంబ వ్యవస్థలోని ఈ సన్నిహిత సంబంధ బాంధవ్యాలే మానసికంగా కలిగే అసంతృప్తుల్నీ ఆందోళనల్నీ తీసివేయగలవి. మిత్ర ఆ ఆలోచనల్లోనే నవీతో విశ్వ గురించి చెప్పలేదింకా అని కూడా గుర్తు చేసుకుంది.*************************************************

విశ్వ మనసులో ఏదో వెలితి. మిత్ర వెళ్ళి మూడు వారాలు. మరొక వారం. మనసాగటం లేదు. ఒక్కసారనా మాట్లాడాలని వుంది. తన దగ్గర వాళ్ళ తాతగారి ఫోన్ నంబర్ లేదు. విష్ణుకి కాని, అనంత అక్కకి తెలుసుంటుంది.

డైరీ చేతిలోకి తీసుకున్నాడు. రాండంగా పేజీలు తిప్పాడు. దాదాపుగా మిత్ర ప్రస్తావన లేని పేజీనే లేదు. పెన్ చేతిలోకి తీసుకుని ఆ రోజు పేజీ వ్రాసుకోవటం మొదలు పెట్టాడు.

"విశ్వామిత్ర" అని వ్రాసి మిత్ర అన్న పదం మీద మళ్ళీ మళ్ళీ దిద్దుతూ ఆగాడు.

"మిత్ర మీద ధ్యాసతో పనిలో కూడా పరధ్యాసలో పడిపోతున్నాను. మిత్ర లోని అందం కావాలి అన్న స్వార్థం నాకు లేదు. నిజానికి తన సంపూర్ణ వ్యక్తిత్వం నన్ను ఆకర్షిస్తోంది. ఒక మనసు మరొక మనిషి కోసం తపించటం అన్నది మిత్ర వల్లనే నాకు అనుభవంలోకి వస్తుంది.

స్నేహం అన్న పునాది బలపడిన ఈ తరుణంలో ప్రేమ మందిరం కట్టి తనని అక్కడ దేవతలా కొలవాలనిపిస్తుంది. పురుషాహంకారం అంటూ కారాలు మిరియాలు నూరే నా బంగారికి నీకు నేను బానిసని అని లొంగిపోవలనిపిస్తుంది. నాలోని భావుకతకి వూపిరి తన వూసే. నాలోని ప్రేమికుని చిరునామా తన నెలవు. తను నేనే వున్న ఈ లోకాన నాకు మరేదీ కావాలనిపించటం లేదు."


కాసేపలాగే సుధీర్ఘాలోచనలో వుండిపోయి, విష్ణుకి ఫోన్ చేసాడు.

"విశ్వ, ఇదేమిట్రా వేళకానివేళలో ఈ కాల్." విష్ణు గొంతులో కాస్త కంగారు. అప్పటికి గానీ టైం సెన్స్ తెలియలేదు. నాలుక్కరుచుకుని, "అదికాదురా, మిత్ర వాళ్ళ తాతగారి నంబర్ కోసమని.." విశ్వ మాట గొంతులో వుండగానే విష్ణు మొదలుపెట్టాడు.

"ఊ ఊ అమ్మగారు ఇక్కడికి రాగానే తన మాటల్లో మార్పు పట్టేసానులే." ఈసారి అతని మాటల్లో ఆటపట్టించే ధోరణి.

"విష్ణు అల్లరి ఆపి ఇవ్వరా ప్లీజ్" విశ్వ కి కాస్త బిడియం అడ్డుగానేవుంది.. నిజానికి తనంత తనిలా చొరవగా మిత్ర విషయంలో ముందుకు సాగటం ఇంకా నమ్మశక్యం కావటం లేదు.

నంబరు తీసుకుని కాసేపు మాట్లాడి పెట్టేసాడు.


*************************************************

అజ్జి తాతతో కూర్చుని కబుర్లాడుతూ, నవీ పిల్లల్ని ఆడిస్తున్న మిత్రకి తాతగారి పిలుపు, "అమ్మలు నీకు ఫోన్" అంటూ.

నాన్నగారైతే చెప్పేవారే ఇంకెవరై వుంటారు అనుకుంటూ లేచివెళ్ళింది లోపలికి.

"హెల్లో మిత్ర నేను విశ్వని" ఆ మాటలో ఒక్కసారిగా ఉప్పొంగిన భావాలు. ముప్పిరిగొన్న సంభ్రమాశ్చర్యాలు. మాటరాని మూగదనం.

యుగాల అన్వేషణ ముగిసి ప్రణయమూర్తి ప్రత్యక్షమైన అపురూప అనుభూతి.

"విశ్వ, ఎలా వున్నారు?" గొంతు పెగలటం లేదు.

మాటలన్నీ చేతికందక రాలిపడే ప్రత్తిపూల మాదిరిగా పెదవి వెనుకే అందీ అందక వూరిస్తున్నాయి.

అవతలి ప్రక్క విశ్వదీ అదే స్థితి. ఇద్దరికీ ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్నంత ప్రశాంతత.

"మీతో ఒక్కసారి మాట్లాడాలనిపించింది." విశ్వ మాటకి ప్రేమసింహాసనం మీద కూర్చుండ బెట్టినంత విజయ దరహాసం మిత్ర మోము మీద తొణికిసలాడింది.

"నాకూ మీరు తరుచుగా గుర్తుకు వస్తున్నారు." మిత్ర నెమ్మదిగా మాటలు కూడదీసుకుని అంది.

ఇద్దరి హృదయాలు కలిసి ఆలాపిస్తున్న గీతం - ఎన్నో యుగాలు అజరామరంగా నిలిచేవున్న ప్రేమ. రాగం అవసరంలేని అనురాగం. తనంత తనుగా ఇరు జీవితాల్లోకి విచ్చేసి ఎవరికీ తెలియని ఓ అనుసంధానం ఏర్పరిచే వరం.

మనసుల సాక్షిగా ఏకమైన ఆ ఇరువురి లోకం ఒకటే. మిత్ర చిరు కవితగా వ్రాసుకుంటే, విశ్వ కంటికాంతుల్లో దోగాడిన అనుభూతి అది.

నేను నీతో కలిసి సప్తసాగరాలు ఈదేసాను, సఫలీకృతురాలనయ్యాను.
సప్తస్వరాలు అలాపించేసాను, సుస్వర గానాలు చేసాను, సప్తపది ఇంకేలా అన్నాను.
సప్తర్షిమండలాలు తిరిగి వచ్చాను, సంతృప్తి సంహితనయ్యాను.
సప్తవర్ణ స్వప్నాలు కన్నాను, గాఢమైన సుషుప్తి చెందాను
.
[సశేషం]

కారాలు+మిరియాలు = గారాలు+మురిపాలు

ఏమున్నదిలే నేర్పరితనమందున,
అసలు కిటుకు తెలుసుకొనుటయేగాక.
పాకశాస్త్రమన్నది నలభీములది కానేకాదు,
చాకచక్యమున్న ఎవరికైనను కరతలామలకమది.

ఆకు తరిగితే పప్పు ఉడకాలి,
కాడ మిగిలితే పులుసు పిండాలి.
అరటి, బీర వండితే తప్పదు తొక్కల పచ్చడి,
పనసపొట్టుకి ఆవ, 
పొట్టిక్కలతో చేవ
అసలింతియె గాక-
ఇంతుల కెందులకు ఏమరుపాటు!?

పప్పు, దప్పళాలు, పచ్చళ్ళు,
ఇగుర్లు, వేపుళ్ళు, కారప్పొళ్ళు,
ఇరుగుపొరుగుల చేదోడువాదోడు వంటలు,
నలుగురితో సయ్యాటలు పిండివంటలు.

పోపు గింజల చిటపటల తకథిమి తాళాలు,
సనికెల్లు మోతల సుర దుందుభులు,
లేత కూరల గుభాళింపు దాకలు,
తీగ పాకపు నోరూరించు డేగిసాలు,
పొంగేటి పాల పరవళ్ళు,
ఉడికేటి ముక్కల ఉరవళ్ళు,
మా ఇంటి వంట నా కొంగుబంగారము

కారాలు కూరినా మమకారమూ వేస్తాను,
గారాలు పోయినా కడుపునిండా కూరతాను,
మురిపాల వడ్డనలో మాకెదురు ఎవరు?
నా చేతి ముద్ద నమ్మరూ "అబ్బో అమృతమే"నంట,
నాకీ వంటలు వంటబట్టించిన అందరికీ నమోనమః


************************************
వంట పట్ల నాకు చాలా మక్కువ, అలాగే వండుతున్నంతసేపూ చాలా ప్రశాంతంగా గడుపుతాను. పాటలు పెట్టుకుని, డాన్స్ చేస్తూ, పాల గ్లాసుతో మొదలుపెట్టి, సగం కూర ముక్కలు స్వాహా చేసి, మరి కొన్ని పళ్ళూ మాయం చేసి ముగిస్తానా ప్రదర్సన. నా వంటకి మంచిపేరు కూడా ;)

ఇక పొతే చూసి కొంత, ఆసక్తితో ఊహ జోడించి కొంత తప్పా పాళ్ళు, లెక్కలు నా తలకెక్కవు. నాన్ స్టిక్ వాడను. మా అమ్మ గారు వాడిన ఇత్తడి, ఇనుప మూకుళ్ళు నాకూ రోజూ వారి వంటకి వినియోగపడతాయి. అలాగే సనికెల్లు వాడకం.

ప్రతి కూరగాయ నుండి వీలైనంత సారాన్ని, ఉపయోగాన్ని మా నాయనమ్మ, అమ్మమ్మ గార్లు చూపారు. నాకు నా వంట ప్రతీది ఇష్టమే. అందుకే ఒక్కటో వ్రాయలేక నా పద్దతి వ్రాసాను.