మరుజన్మ

దప్పికగొన్న జలధార హిమగిరికి వినతి నిచ్చిందనేమో
జలపాతాన్ని ఇముడ్చుకున్న కోన మూతి ముడిచింది
మేటలేసిన కూన మింటి వంక మోర చాపిందనా
అడగక అన్నీ ఇచ్చే నేల తల్లి నెర్రలుగ విచ్చిందనో
పాతాళగంగ వేయి పడగలెత్తి పరుగిడివచ్చింది
ముడుచుకున్న కోన హరితవనాల పక పక లాడింది

జలధార పరవళ్లలో పుష్కరాలొచ్చాయి

ప్రకృతి నైజం నదిని నిలవనీకపోయిందా?
నురగలుగక్కుతూ ఒడ్డుని ఒరుసుకుంది
గట్టులెక్కి తొక్కుడుబిళ్ళలాడింది
పాకుడురాళ్ళెక్కి జారుడుబండ జారింది
తామసికి తలవంచి తన పుటుక మరిచింది

ఉప్పెనై ఎగిసింది, ఉరుకురికి దూకింది

గుండెలవిసే వేగాన వూర్లమీద పడింది
అలిసాక ఆగింది, అదుపు తప్పాననుకుంది
ముంపులోని మాగాణిపైరు చూసి వెరచింది
శవాల గుట్టల దుర్గంధాన్ని పీల్చి వణికింది
బురదమట్టి కాలువల్లో ముక్కలైన తనువున ముగిసింది

గట్టు పక్కన కొండ గుండె పగిలింది

శిలలోని నీరు చితాభస్మానికి గంగ జల్లులై తాకింది
నది కడుపు మళ్ళీ పండింది, శిల ముద్దుబిడ్డైంది
కన్నెగా బతుకు ముగిసి తల్లిగా పుట్టింది
వెనకటి జన్మల పాపపుణ్యాలు సరిలెక్కలయ్యాయి
తృళ్ళింత నడక మందగమనగ మారింది

తడిమిన శిలని అక్కున చేర్చుకు వూయలూపింది
నోరు చాచిన జీవికి రొమ్ము కుడిపి తరించింది
పచ్చిక బైళ్ళలో లేడికూన నెమరువేతైంది
పాలకంకి పైన పిట్టనోటి కూతైంది
మావి చిగురులో లేత మెరుపైంది
మల్లియలో, మరువంలో మంచి గంధమైంది

కలలో కాంచనిది ఇలలో చూసి మురిసింది
మరో జన్మ ఇక వద్దని భూమిసుత నది కదిలింది.

No comments:

Post a Comment