కథ: తులసికోట

గోదావరి జిల్లాల్లో ఓ పల్లెటూరు. ఇప్పటికి ముప్పై ఐదేళ్ళ పైనాటి మాట. ఉమ్మడి కుటుంబాలు అపుడపుడే విడిపడుతున్న రోజులు.

సాయంసంధ్య వేళ. చల్లబడ్డ సూర్యకిరణాలు కాస్త ఎరుపుకి తిరిగాయి. పశువుల కాపర్లు గొడ్లని కాలవల్లో కడిగి ఇళ్ళకి మళ్ళిస్తున్నారు. వీధుల్లో కాస్త ఆ సందడి. కొందరు ముందు గుమ్మాలు చిమ్మి సాయంత్రపు ముగ్గు వేస్తున్నారు.

పాలు, పెరుగు, పాత ఆవకాయ పచ్చడి కొనుక్కోను ఇళ్ళ చుట్టూ తిరిగే రోజు కూలీలు, మనవల్ని చంకనేసుకుని పాలబువ్వో, పెరుగన్నమో, చారన్నమో తినిపించేవారు మరి కొందరు. గుమ్మాల్లో అరుగుల మీద దూకుళ్ళాటలు ఆడుతున్న పిల్లలు. కావిళ్ళతో మంచినీరు తెస్తున్నవారు, అలా రకరకాల జన సందోహం.


ఆ వీధి అంతా మండువా ఇళ్ళే. ఒకదాన్ని ఆనుకుని మరొకటి. పెద్ద పెద్ద ఎత్తరుగులు. అటువంటిదే ఆ ఇల్లు. గుమ్మానికి అటూ ఇటూ రెండు వాటాలుగా మేనత్త, మేనమావ సంతానం కి చెందిన చావిడి అది. సూరయ్య గారు వీధరుగు మీద కూర్చుని రామనామ స్మరణలో వున్నారు. ముడతలు పడ్డ మొహం, ఎనభైకి సుమారు వయసు, వయసుని తెలుపుతున్న బలహీనపడ్డ దేహం.

ఎప్పటిమాదిరే వంట పాకలో ఆయన కోడలు కమల అన్నం వార్చుతూ, చుట్టాలు వస్తున్నారని పాలేరు మీద మధ్య మధ్యలో కేకలేస్తూ హడావుడి పడుతూ వుంది. పెరటివైపు ఇంటికి, వంట పాకకీ మధ్యన తులసికోట.

వంట పాక గోడకి మట్టితో అలికి కట్టిన చిన్న అరుగు మీద ప్రత్తి వత్తులకి విడతీస్తూ కూర్చునున్నారు సీతమ్మ గారు. ఆవిడ కట్టుకున్న తెల్లచీరతో పోటీ పడ్డట్టు నెరిసిన జుట్టు. కళ్ళజోడు ఆమె యాభై దాటిన వయసుని తెలుపున్నట్లుగా వుంది. పరీక్షగా వింటే ఆవిడా యేదో స్మరణ చేసున్నట్లు తెలుస్తుంది.

"కమల, ఎందుకే అంత హడావుడి పిచ్చితల్లి. వచ్చేది మాధవ ఒక్కడేగా?" అన్నారు సీతమ్మ గారు చిన్నగా నవ్వుతూ.

మాధవ సీతమ్మ గారి కొడుకు. ఒక నెలగా అన్నగారింట వున్న తల్లిని తీసుకువెళ్ళటానికి ఆ రోజుకి వస్తున్నానని ఉత్తరం రాసాడు. పైగా ఆ మర్నాడు తండ్రి తద్దినం. కాలవ స్నానాలు వుంటాయి. ఊర్లోకి పెద్దగా ప్రయాణసదుపాయం లేదు. మూడు మైళ్ళ అవతల వంతెన మీద బస్సు దిగి, వూర్లోకి రిక్షాలు, బళ్ళు కట్టించుకుని రావాల్సిందే.

"మీరలాగే అంటారు పిన్ని. మా మర్యాదలు మానతామా." గోంగూర పచ్చడికని వేపిన పోపు రోటి దగ్గరకి తెస్తూ అంది కమల.

"నేను పచ్చడి నూరతాను. నువ్వు మిగిలిన పని చూస్కో." అంటూ లేచారావిడ.

"రంగా, కాస్త ఆ మంట ఎగదోసి నీళ్ళు కాగాయేమో చూడరా. పెద్దయ్యగారికి తోడేస్తే మళ్ళీ కాగుంటాయి చుట్టాలొచ్చేసరికి ..." కమల ఈ మాట అంటూ వంట పాకలోకి వెళ్ళింది.

సీతమ్మ గారు కూర్చున్న అరుగు వారగా కోళ్ళ గూడు. పాకకి, ఇంటికి నడుమ ఓ ప్రక్కగా బావి. బావి చాఫ్టాని ఆనుకుని నీళ్ళ తొట్టి. అందులో తేలుతున్న బీరకాయలు, అరటి కాయలు. కూరగాయలు పాడవకుండా అలా దాచేవారు.

పాక వెనగ్గా, మిగిలిన స్థలం అంతా మరీ వరసలు పెట్టి కాదు కానీ, ఓ మల్లె కుదురు, కరివేరు చెట్టు, నిత్యమల్లి మొక్క, నందివర్థనం, మందారం, కర్వేపాకు, నిమ్మ చెట్టు, మునగ చెట్టు, జామ చెట్టు, కనకాంబరాలు.

బావి వెనగ్గా చిన్న కూరమడి. బెండ, మెట్ట వంకాయ మొక్కలు, గోంగూర, తోటకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి మళ్ళు. వంట పాక వెనక నించి పాకిన ఆనప, బీర, దోస పాదులు. పందిరికి పాకించిన దొండ, చిక్కుడు. ఏపుగా ఎదిగిన మొక్కలు, చెట్ల తో పచ్చగా కళకళలాడుతున్న పెరడు. కోటలో గుబురుగా సిరివుట్టిపడుతూ తులసమ్మ.


పచ్చడి నూరుతూ సీతమ్మ స్వగతంగా అనుకుంది ఆయన ఈ లోకం విడిచి అప్పుడే ఇరవై యేళ్ళు గడిచిపోయాయి. తులసమ్మ ఆ ఒక్కరోజే కదా తలవాల్చింది. చేతులో పని సాగుతూనేవుంది మనసు ఆనాటి ఆలోచనల్లోకి సాగిపోతుంది.

*************************************************

సీతమ్మ సూరయ్య గారి మారుటి చెల్లెలు. వారిది తొమ్మిదిమంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ కుటుంబం. తండ్రి అచ్చియ్య గారు. నరసమ్మ గారు, సూరయ్య గారు ఇలా ఏడుగురు తర్వాత వారి తల్లి మరణించాక, రెండో వివాహం ద్వారా మరొక మగ సంతు, సీతమ్మ కలిగారు.

సీతమ్మని ప్రసవిస్తూ ఆవిడా ప్రాణం విడిచింది. అప్పటికే కాపురానికి వచ్చిన పెద్ద కోడలు, సూరయ్య గారి భార్య లక్ష్మీదేవి ఇక ఆ ఇంటికి ఆడ దిక్కు. అచ్చియ్య గారి తల్లి జానకమ్మ పెద్ద దిక్కు. సీత ని ఆవిడే పెంచారు. అచ్చియ్య గారు "బుల్లి" అని ప్రేమగా పిలుచుకునేవారు. అదే పిలుపు యేడుగురు అన్నలు, వదినలదీను.


స్వతంత్ర పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజులు. ఖాదీ ఉద్యమం పల్లె పల్లెల్నీ వూపేసిన తరుణం. సీత కి అలా ఖాదీ వస్త్రాలు అలవాటు . తన పదకుండో యేట మేనమావ కొడుకు సూర్యం తో సీత పెళ్ళి జరగ్గానే తండ్రి మంచం పట్టేసాడు. సూరయ్య గారి చేతిలోకి ఇంటి బాధ్యతలు మారాయి.

పదిహేనేళ్ళ సూర్యం ఇంటిపట్టున వుండటం తక్కువ. కళాభిమానం ఎక్కువ. మంచి స్ఫురద్రూపి. ఆరడుల ఎత్తు, ఎత్తుకి తగ్గ మనిషి. ఎర్రటి మనిషి, నల్లటి వుంగరాల జుట్టు. నాటకాల్లో పద్యాలు లీనమైపోయి పాడుతుంటే జనాలు అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోయేవారని సీతకి అన్నలు చెప్తూవుండేవారు. తనంత తను చూసిందెన్నడూ లేదు.


సీతకి పదహారో యేడు నడుస్తుండగా మాధవ కడుపున పడ్డాడు. తను పుట్టింటికి రావటం, స్నేహితునితో కలిసి సినిమాలు తీయటానికి సూర్యం మద్రాసుకి పయనమవటం ఒకసారే జరిగాయి. అంతదూరం సీతని ఒక్కదాన్ని పంపటానికి పెద్దలు ఇష్టపడలేదు.

అప్పటినుండి కుటుంబ బాధ్యత ఒకటొకటిగా వదిలేసాడు. కొంత బావగార్లు, మరికొంత అన్నగార్లు చొరవ చేసుకుని మందలించినా అతనిలో మార్పు రాలేదు. మరో ఐదేళ్ళకి లక్ష్మి పుట్టింది. సూర్యం రాకపోకలు ఎడం పెరుగుతూ వస్తుంది. కాస్త కాస్త పొలం అమ్మటం వరకు అతని ఖర్చులు పెరిగాయి.


మద్రాసులో ధాన్యం వ్యాపారం చేసే తమ వూరి మనిషి ద్వారా సూర్యం తనతో నటిస్తున్న కోమలవల్లిని వివాహం చేసుకున్నాడని విన్నది. అన్నగార్లతో కూడ ఆ మాట ఎత్తలేదు, మౌనంగా పూజలో నిమగ్నమై మనసుని వూరడించుకోవటం తప్ప. వదినలంతా మంచివాళ్ళే కానీ ఇద్దరికి మాత్రం కాస్త నోరు దురుసు. సూర్యం సంగతి తెలిసాక మాటజారారు. లోకువ కట్టారు. అయినా సీత నొచ్చుకోలేదు. భర్త నోట నిజం తెలుసుకోవాలనే ఆగింది.

సూర్యం ఆ మారు వచ్చినపుడు తటపటాయిస్తూ "నలుగురు నాలుగు రకాలుగా అంటున్నారు.." అంటూ ఆగిపోయింది.

"సీత ఇలా దగ్గరగా రా." సూర్యం గొంతులో తొణికిసలాడుతున్న ప్రేమ.

కళ్ళనీళ్ళు నిండిపోయాయి. ఆమెని పొదివి పట్టుకుని "నేను చెప్పేది నెమ్మదిగా విను. ఆ తర్వాత నీ ఇష్టం." అన్నాడు.

"నీకు తెలియందేముంది. నాకు నీవంటే ప్రేమ కి లోటు లేదు. నాటకాల పట్ల అభిమానం, అదే ఇప్పుడు సినిమాల పైకి మళ్ళింది. అది నా బలహీనత కూడ. కోమలి నాకు చిన్నప్పటినుండీ పరిచయం. మా ఇష్టం ప్రేమ అని తెలుసుకునే నాటికి మన వివాహం అయిపోయింది. తను నన్ను నమ్ముకుని మద్రాసుకి వచ్చేసింది. ఎవరి అండదండలూ లేవు. నీకు అంతా వున్నారిక్కడ. నాకు నువ్వు కావాలి. కానీ నా పట్ల పిచ్చిప్రేమ పెంచుకుని వచ్చేసిన ఆ అమాయకురాలినీ వదుకోలేకపోయాను. తనని వివాహమాడాను. నీ దగ్గర దాయాలనుకోలేదు. ముందుగా చెప్తే కోమలిని యేమైనా చేస్తారని భయపడ్డాను. నన్ను క్షమించు సీత. నేను చిక్కుముడిలో వున్నాను. నిన్ను, పిల్లల్ని వదలను. నేను నీ ఒక్కదానికే జవాబుదారీని. ఈ ముడి విప్పే భారం నీదే." అతని మాటల్లో నిజాయితీ.

అలాగే లేచి వెళ్ళి, కాళ్ళు చేతులు కడుక్కుని పూజ గదిలో కూర్చుండిపోయింది. "అమ్మా పార్వతి, నాకేమిటి కర్తవ్యం? నాకెందుకీ పరీక్ష?" సీత కళ్ళలో దైన్యమే కానీ కోపం లేదు. కుటుంబమే లోకం గా పెరిగిన మనిషి. అంత నిస్సహాయస్థితిలోనూ కోమలి ని గూర్చి "ఎవరి అండదండలూ లేవు" అని అతనన్న మాట మరవలేదు.

అలా దాదాపుగా ఓ వారం పది రోజులు అన్నపానాలు మాని విలపించింది. శోకం అణిగింది. ఆలోచన మొదలైంది.

"తనకి ఇద్దరి పిల్లల బాధ్యత వుంది. ఇపుడు అతన్ని బలవంతాన ఇక్కడ ఆపగల శక్తి తనకి లేదు. అలా చేసి అవతల మనిషిని అనాథని చేసి తను బావుకునేదీ లేదు. ఇల్లు వదిలి ఎక్కడికో పోయి బ్రతికే స్వశక్తి తనకి లేదు. ఇది దైవసంకల్పం. తనకొక పరిష్కారం కాలమే చూపాలి. తమ ముగ్గురి జీవితాలు ఈ బంధనంలో చిక్కడిపోయాయి. తను భర్తని ద్వేషించలేదు. అతనికి తన పట్లగల అనురాగంలో యే లోపం లేదు. బాధ్యతని విస్మరించి అలా అభిరుచి లోకాన పడి నడవటం మాత్రం తనని, పిల్లల్ని ఇబ్బంది పాలుచేస్తుంది. ఆ సమస్యకి కోమలి బాధ్యురాలు కాదు. ఇటు తన కుటుంబాన్ని నడపని వ్యక్తి మళ్ళీ ఆమె భారం తను తీసుకోవటం యెంత సబబు. ఈ పరిణామానికి కారణం ప్రేమా? తను దగ్గరగా లేక ఆమె చేరిక వలన జరిగినదా? అసలిక ఈ ఆలోచనల అవసరముందా?" స్వగతంగా ఎన్నిసార్లు ఈ మాటలే తిరగ తిప్పి అనుకుందో అన్నిసార్లు బరువెక్కిన ఆమె హృదయానికే తెలుసు.

సూర్యం ఆ సారి ఓ నెల వరకు వుండిపోయాడు. ఇద్దరి నడుమా ఇక ఆ ప్రసక్తి రాలేదు. కానీ ఆమె అన్నగార్లకి, అతని అన్నగార్లకీ విషయం తెలిసి అతన్ని వెలివేసినంత పని చేసారు. సీత అంత ఉత్తమ ఇల్లాలికి ఈ మనస్తాపం కలిగించిటానికి నీకు మనసెలా వొప్పిందని నిందించారు. సూర్యం మౌనంగా వుండిపోయాడే కానీ ఒక్కమాట తిరిగి అనలేదు.

అతను ప్రయాణమయ్యే నాటికి పంట చేతికొచ్చింది. పెద్దవాళ్ళెవరూ ఒక్క రూక అతనికి అందనీయలేదు. ఆ రోజే అతను వెళ్ళేది. గదిలో దండానికి తగిలించిన లాల్చీ తొడుక్కుని, వెనుదిరిగే సరికి సీత గది తలుపు మూసి దగ్గరకి వచ్చింది.

ముందుకు చాపిన గుప్పిట విప్పి అతని చేతిలో పెడ్తూ "కోమలికి నా కానుగ్గా ఇదివ్వండి." అంది. అవి ఆమె నల్లపూసలు. గొంతులో అదే సౌమ్యత.

"సీత, నీకున్న బంగారం అంతంత మాత్రం. నా సంపాదన ఎటూ లేదు. ఇది ఇలా ఇచ్చేయటం.." అతని మాట పూర్తయేలోగానే సీత వారిస్తూ, "అలా కాదు. నా మనసుకి తోచినదిదే. మీ జీవితాన్ని మా ఇద్దరికీ పంచారు. నాకు కలిగినది తనకి ఇవ్వటం లో తప్పులేదు," తిరిగి తనే పొడిగిస్తూ

"ఇది తప్పో వొప్పో నాకు తెలియదు. నాకు తెలిసిన లోకం చిన్నది. నా వంటి మనిషే తను అన్న భావన అంతే." అంది.

అతని మనసులో ఎక్కడో అప్పుడు కదలాడింది అపరాధబావన. "నన్ను క్షమించు సీత. నేను స్వార్థపరుడిని. తలవంపు పని చేసాను. రేపు కన్నపిల్లలు కూడా అసహ్యించుకుంటారేమో" అన్నాడు.

"అంత దూరం ఆలోచించకండి. ఆ సమయానికి అయ్యేదేదో అవుతుంది." అని "ఇదిగో ఈ నగ అవసరపడవచ్చు. మీకు డబ్బుకి ఇబ్బంది అని తెలుసు." అన్నాక గానీ గమనించలేదు ఆమె మెడలో పసుపుతాడు వుందని. సూత్రాల గొలుసు కూడా అతనికే ఇచ్చేసింది.

"నీకు ఋణపడిపోయాను సీత. ఈ కుటుంబాన్ని పోషించగలనాడే తిరిగి నీ దగ్గరకి తలయెత్తుకుని వస్తాను. అందాక మీ వారి, మా వారి అండదండలు నీకు రక్ష." అంటూ గుమ్మం వదిలాడు.

ఆమె మనసున తుఫాను వెలిసిన ప్రశాంతత. అతను తన దగ్గర యేదీ దాచలేదు. తనకి తోచిన విధంగా తను ముడివిప్పింది. అందరికీ ఆ పైవాడే అండదండ.

ఆ తర్వాత సూర్యం రాకపోకలు వేళ్ల లెక్కన అంతే. పిల్లలిద్దరినీ గుట్టుగా పెంచుకుంటూ, అన్నలు, బావగార్ల అండదండలతో సంసారం లాక్కొస్తుంది. పెద్ద వదిన నయం కాని జబ్బుతో కాలం చేయటం, అన్నయ్య ముగ్గురు పిల్లలకీ తనే పద్ద దిక్కైంది. నిజానికి పెద్ద మేనల్లుడిది దాదాపుగా తన వయసే. ఆ బిడ్డల పోషణలో భర్త ధ్యాస పూర్తిగా మర్చిపోయింది.

మాధవ తెలివైన కుర్రాడు. చదువులో చురుకు ఎక్కువ. ఎండనక, వాననక మూడు మైళ్ళు పడి వెళ్ళి ప్రక్క వూరి బడిలో చదువుకుంటున్నాడు. తండ్రి అంటే గౌరవాభిమానాలు. తల్లి అంటే అమిత ప్రేమ. చెల్లిని "పాప" అంటూ అనురక్తితో చూసుకునేవాడు. చూస్తుండగానే మరో పదేళ్ళు గడిచిపోయాయి. మాధవ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

మాధవ కి ఇరవైవ యేడు నడుస్తుండగా తండ్రి కబురందుకుని వెళ్ళి కలిసి వచ్చాడు. ఆ రాత్రి అన్యమనస్కంగా వున్న కొడుకుని "అబ్బాయ్ మాధవ, ఏమిట్రా అలా వున్నావు?" అని అడిగింది. ఏమీ లేదని మాట తప్పించబోయినా తల్లి వూరుకోలేదు.

"ఇక ఆయన మన మనిషి కాదమ్మా. ఆయనకి మరొక కొడుకు కూడా వున్నాడు. అతన్ని ఆయనే చదివిస్తున్నారు," మాధవ గొంతులో కనీ కనిపించని కోపం. "వచ్చేనెల్లో వస్తారట, నిలదీసి అడుగు." అన్నాడు.

సీత ముందు నివ్వెరపోయింది. తనకి తెలియదు ఈ విషయం. తర్వాత కొడుకు ప్రక్కనే కూర్చుని వెన్ను నిమురుతూ "నువ్వు చాలు నాయన నాకు. ఇక ఈ కుటుంబ భారం నీదే. తండ్రిని తప్పుబట్టబోకు. ఇవన్నీ మన చేతిలోవి కావు. కర్మఫలాలు. ఇన్నాళ్ళు మావయ్యలు మననెంతో ఆదుకున్నారు. ఇకపై నీవు నన్నూ, చెల్లినీ చూసుకోవాలి." అంది. అలా కాసేపు తల్లీబిడ్డా మౌనంలో మునిగి వుండిపోయారు.

మరొక మూడు వారాలకి సూరయ్య గారి పెద్ద కోడలు కమల బలవంతం మీద మూటలతో ఇంటికి వచ్చి చీరలవీ అమ్మే మాణిక్యాలరావు దగ్గర ఐదు రంగు బట్టలు కొని, ఆది జాకెట్టుగా తన ఖాదీ రవిక ఇస్తూ పసుపు బొట్టు అద్ది ఇచ్చింది. పుట్టాక సీత మనసున వున్న ఒకేఒక్క గాఢమైన కోరిక అది. రంగు జాకెట్టు తొడుక్కోవాలని.

ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజ చేసుకుని చివరగా తులసమ్మకి పూజకని పెరట్లోకి వచ్చేసరికి కాస్త తలవాల్చినట్లున్న కొమ్మలు చూసి మనసు కీడు శంకించింది. నీరు పోసి, కోటలో భూసింధూరం నుదుటికి అద్దుకుని అక్కడే కూర్చుండిపోయింది.

ఆ రోజే సూర్యం చనిపోవటం, వూరిలోకి శవాన్ని తేవటం అనువు కాదని దహన సంస్కారాలు మాధవతో అక్కడే పూర్తి చేయించారు. అప్పటికి సీత సూర్యాన్ని చూసి ఐదు సంవత్సరాలు.

అలా సీత రంగుల కల తెల్ల చీరగా ముగిసిపోయింది. ఇరవై ఐదేళ్ళ ఆమె వైవాహిక జీవితం గతానికి చేరిపోయింది. కన్నిటి వరదలో కుంకుమ తుడుచుపోయింది. పదకుండో రోజుకి వచ్చిన కోమలి సూర్యం ఫోటో ఒకటి ఇచ్చి వెళ్ళింది. అందులో సూర్యంకి ఆమె వలన కలిగిన బిడ్డ కూడా వున్నాడు. ఆ పఠాన్ని భద్రంగా దాచుకుంది. మనసులోని అతని రూపు తనేనాడూ మరవలేదు.

తమ్ముడు పోయాక అతని అన్నల్లో కాస్త మార్పు. పొలాల దగ్గర కాస్త స్వార్థాలు చూపారు. వచ్చినంత వాటాతో పెద్ద అన్నయ్యతోనే వుండిపోయింది.

మాధవ ఉద్యోగంలోకి చేరటం, అతని పెళ్ళి అవటం. ఇల్లు, పొలాలు అమ్మేసి చెల్లి కట్నంగా ఇచ్చి మంచి వరునికి ఇచ్చి పెళ్ళి చేసి తల్లిని తన వెంట తీసుకుపోవటం ఆ తర్వాత ఐదేళ్ళలో జరిగిపోయింది.

అంతవరకు వూరి పొలిమేర దాటని చెల్లిని హత్తుకుని సూరయ్య గారు విలపిస్తూనే పంపారు. అప్పటి నుండీ అపుడపుడూ అన్నల దగ్గరకి రావటం జరుగుతూనే వుంది.

*************************************************

వంతెన మీద ఆగిన బస్సు దిగిన మాధవ చెయ్యి పట్టుకుని ఆరేళ్ల భవాని చుట్టూ వింతగా చూస్తూ నడుస్తుంది. పైకి మడిచి రిబ్బన్లు కట్టిన రెండు జడలు. అంబ్రిల్లా మోడల్ గౌన్లో కూడా సన్నగా కనపడుతున్న పిల్ల.

ఒక ఐదు నిమిషాలు చూస్తే తెలిసిపోతుంది, గుక్కతిప్పుకోకుండా ప్రశలేస్తుందని. వంతెన కి కాస్త దిగువగా ఒక సోడాలు, కాస్త చిరుతిళ్ళు అమ్మే బడ్డీ కొట్టు, చిన్న టీ హోటల్, ప్రక్కగా సైకిల్ అద్దెకిచ్చే కొట్టు. అక్కడే ఓ నాలుగైదు గూడు రిక్షాలు, ఒక గుర్రపు బండి వున్నాయి.


"భవానీలు, రిక్షా ఎక్కుతావా? గుర్రం బండి ఎక్కుతావా?" మాధవ మాట పూర్తవకమునుపే "నాన్న గారు, నేను సైకిల్ తొక్కొచ్చా?" అ పిల్ల అడిగిన తీరుకి ముచ్చట వేసింది.

"అది పెద్ద వాళ్ళకమ్మా, నీకు కాళ్ళు అందవు. పోనీ నేను తొక్కనా?" అని అడిగాడు.

"భలే భలే, నేను ముందు ఎక్కుతాను." కేరింతలు కొడుతూ అంది.

సైకిల్ అద్దెకి తీసుకుని, తెలిసిన రిక్షా అతను జోగులుకి తన చేతిలోని బాగ్, పళ్ళ బుట్ట, మర్నాడు తన తండి సంవత్సరీకానికి కావల్సిన సామానులున్న అట్ట పెట్టె, సూరయ్య గారి ఇంటిలో చేర్చమని పురమాయించి, భవానీని ఎత్తుకుని ముందు కడ్డీ మీద కూర్చోబెట్టి నెమ్మదిగా తొక్కటం మొదలు పెట్టాడు. జోగులు వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు, అలవాటైన బాటే కనుక పైగా సవారీ ఎవరూ లేరు.

పొలాల మధ్య వెళ్తున్న కంకర రోడ్డది. కాస్త ఎతుకులు గతుకులు గా వుంది. భవాని కుతూహలంగా పరిసరాలు గమనిస్తూ యేదో ఒకటీ అడుగుతూనే వుంది. మధ్య మధ్యలో సైకిల్ బెల్ "ట్రింగ్ ట్రింగ్.." అని తన నోటితో జతకలిపి మరీ మోగిస్తూ సందడి చేస్తుంది.

కాస్త దూరం వెళ్ళాక, ఒక కాలువ మీదుగా వెళ్తున్న వంతెన మీద ఆపాడు. పిల్లని దించి సైకిల్ కి స్టాండ్ వేసి "అమ్మలు, నీకొక మాట చెప్తాను, గుర్తు పెట్టుకుంటావా?" అని అడిగాడు.

"ఓ ..." కళ్ళు రెండూ గుండ్రం గా తిప్పుతూ, నోరు కూడా సున్నాలా తిప్పి మరీ చెప్పింది.

"ఇదిగో చూసావా, ఈ కాలువ మీద ఓ తెల్ల దొర గూటి పడవలో అలా వెళ్తూ వుండేవాడు. నేను అప్పుడు నీ అంత వుండేవాడివి. అతనిలా దర్జాగా వుండాలనే చదువుకుని ఉద్యోగం చేస్తున్నాను. నువ్వు కూడా చదువుకుంటావా?" అని అడిగాడు.

"ఊహు నేను సీతమ్మామ్మలా పూజలు చేస్తాను. మామ్మకి పార్వతీదేవి కనిపించింది. నేను సరస్వతిని చూస్తాను." అమాయకంగా సమాధానమిచ్చిన కూతుర్ని చూస్తే మాధవకి తను వేసిన ప్రశ్నకి జవాబిచ్చేంత వయసు ఆ పిల్లకి లేదనిపించింది.

"నాన్నగారు, మరి అమ్మమ్మ వూర్లో రైలు బండి ఎక్కిన తెల్లదొర బిళ్ళలిచ్చాడట. అమ్మ చెప్పింది. నీకు ఆ పడవ ఎక్కినవాడు ఇచ్చాడా బిళ్ళలు, బిస్కట్స్?" అని అడిగింది.

"ఇచ్చాడమ్మా అంతకన్నా ఎక్కువే తాయిలం ఇచ్చాడు. అతనిచ్చిన స్ఫూర్తే ఇదిగో ఇలా నన్ను నిలబెట్టింది." యేదో లోకంలో వున్నట్లుగా అన్నాడు.

"నాన్నగారు, నాకు ఆకలి వేస్తుంది. నాకు పాలు కావాలి." కాస్త బిక్క మొహం పెట్టి అడిగింది. అప్పటికి గానీ ప్రయాణం హడావుడిలో పిల్లదానికి సాయంత్రం పాలకి ఎక్కడా ఆగలేదని గుర్తుకువచ్చింది.

"ఇదిగో ఇంకెంత ఇట్టే వెళ్ళిపోతాము." అంటూ పిల్లని ఎక్కించి హడావుడిగా తొక్కటం మొదలు పెట్టాడు.

ఊరి మొదల్లోకి వచ్చేసరికి పూజారి గారు యెదురయ్యారు.

దిగి నమస్కారం చేసి "బాగున్నారా హనుమాళీ గారు?" అని నమ్రతగా అడిగాడు.

ఎదురెండకి కాస్త మొహం చిట్లించి చూస్తూ "నువ్వటయ్యా మాధవ, ఇదేనా రావటం, మీ మావయ్య అన్నారులే ఇవాళ సందె వేళకి వస్తావని. మళ్ళీ పొద్దున్నే గోదావరికి ప్రయాణం కదా?" అంటూ "ఓరోరి ఈ అమ్మడెవరోయ్, నీ కూతురా?" అన్నారు.

"అవునండి, అమ్మకి బాగా అలవాటు. మూడురోజుల్లో తీసుకొస్తానన్నా వినకుండా, మామ్మని చూస్తానని పేచీ పెట్టి వచ్చింది. ఎప్పుడూ తీసుకురాలేదని వెంటబెట్టుకొచ్చాను." అన్నాడు మాధవ.

ఇద్దరు మళ్ళీ ఓ రెండు నిమిషాల పాటు కబుర్లలో పడ్డారు.

భవాని ఆకలి మాట మరిచిపోయి పూజారి గారి వాలకాన్ని కాస్త వింతగా చూస్తుంది. ఎర్ర పట్టు పంచె, చంకలో యేదో మూట, పిలక, జందెం ఇవి కాక ఆయన మాటలు కాస్త సాగదీస్తూండటంతో సగం సగమే అర్థమౌతున్నాయి.

"భవాని, ఈ తాతగారు నిన్ను మామ్మ దగ్గరకి తీసుకు వెళ్తారు. సరేనా?" అంటూ "నేనలా ఓ సారి చెల్లి పొలం చూసి వస్తానండి. దీన్నీ మావయ్య గారి ఇంటి దగ్గర దింపేస్తారా?" అన్నాడు.

"అలాగే నాయన, దానికేం భాగ్యం. పదవే అమ్మడు.." అని ముందుకు కదిలారు.

ఒక నిమిషం వూరుకుంది గానీ, నెమ్మదిగా ప్రశ్నల్లోకి దిగింది.

"తాతగారు, మీకు ఆ పోనీటెయిల్ యెవరు కట్టారు?" అని అడిగింది.

ఆయనకి పెద్దగా అర్థం కాలేదా మాట.

"ఏం చదువుతున్నావు అమ్మడు?" అని అడిగారు.

"నేను సెంట్ జాన్స్ స్కూల్లో యూ కె జీ చదువుతున్నాను. మా టీచర్ రెజీనా." అని చెప్పింది. ఒకటడిగితే అలా పది చెప్పటం అలాగే అలవాటైంది భవానీకి.

అలా కాస్త నడవగానే, ఆయన ఎదురుగ వున్న సందు వైపు చెయ్యి చాపి "ఇదిగో అలా చూడు ఆ దక్షిన దిక్కు ఇల్లు వుందే, అదే మీ నానమ్మ ఇల్లు. వెళ్తావా అమ్మడు. కాళ్ళు పీకుతున్నాయి. పెద్దవాడిని కదా." అన్నారు.

ఆయన చెప్పిన దిక్కు అవీ తెలియలేదు కానీ, తల వూపి "టా.. టా.." అంటూ అటుగా అడుగులేసింది.

ఇంతలో యేమీ తప్పిపోదులే అనుకుంటూ ఆయన ప్రక్క సందు వైపు నడిచారు.

నాలుగడుగులు పడ్డాయో లేదో, వెనగ్గా పెద్ద గొడ్ల మంద వచ్చింది.

బెదిరిన భవాని పరిగెట్టి ఎదురుగా వున్న అరుగు ఎక్కి స్తంభం చాటున దాక్కుంది. అవన్నీ వెళ్ళాక నెమ్మిదిగా దిగి, కాస్త బిక్క మొహం వేసి చుట్టూ చూస్తే తాతగారు చెప్పిన ఇల్లు కనపడలేదు.

అడుగులో అడుగేస్తూ, సన్నగా వెక్కిళ్ళు పెడుతూ, మూడు గుమ్మాలు దాటి, నాలుగో వాకిలి అరుగు మీద వున్న పెద్ద పుస్తకం చదువుతున్న తాతగార్ని చూసి, దగ్గరగా వెళ్ళి, కాస్త పాదాలెత్తి, ఆయన్ని తన బుల్లి చేత్తో తట్టి "తాతగారు, మా సీతమ్మామ్మ వుందా?" అని అడిగింది.

ఓ నిమిషానికి అర్థం ఆ మాట ఆకళింపుకి వచ్చాక, ఆయన కళ్ళ వెంట జర జరా రెండు కన్నీరు జారాయి.

"ఇన్నాళ్ళకి నా బుల్లి ని వెదుక్కుంటూ ఓ చిన్ని తల్లి వచ్చిందా.." అంటూ "బుల్లీ అమ్మాయ్ బుల్లీ ఇలా రామ్మా, చూడు ఎవరొచ్చారో.." అంటూ గుమ్మం లోంచి లోపలికి చూస్తూ కేక పెట్టారు.

గోంగూర పచ్చడి నూరి తీసి కమల కిచ్చి చెయ్యి కడుక్కుని, సన్నజాజి మాల కడుతున్న సీతమ్మ గబగబా గుమ్మంలోకి వచ్చింది. మనవరాలిని చూడగానే కొండంత సంబరం.

"బంగారు తల్లీ యెలా వచ్చావురా? నాన్న యేడి?" అని ఒక్కడుగులో మూడు మెట్లూ దిగి మనవరాలిని అక్కున చేర్చుకుని ముద్దాడి, చంకనేసుకుంది.

"బుల్లే, నాకిక దిగుల్లేదమ్మా. నీ మనవలు వచ్చేసారు నిన్ను వెదుక్కుంటూ, నిన్ను వాళ్ళే చూసుకుంటారిక.." అప్యాయంగా అంటున్న సూరయ్య గారి మాటల్లో ఇంకా ఆ ఆనందం పోలేదు.

మనవరాలిని లోపలికి తీసుకెళ్ళి కాళ్ళు, చేతులు కడిగి, వేడి పాలు గ్లాసులో పోసి తెచ్చి వూదుతూ, వంటపాక ముందు వేసిన నవారు మంచం మీద కూర్చుని, వొళ్ళో కూర్చోబెట్టుకుని మనవరాలికి తాగిస్తూ ప్రయాణం సంగతి అడిగింది.

అసలు మనవరాలు వస్తుందని మాధవ జాబులో రాయలేదు. సీతమ్మకీ ఆ అనుకోని సంబరం అందులోనూ ఈ మనవరాలు అంటే ప్రాణం. పెద్ద మనవరాలు వాళ్ళ అమ్మమ్మకి చేరిక ఎక్కువ. ఈ పిల్లది పుట్టిన నాటి నుండీ తన ఒడి బిడ్డే.


సీతమ్మ గారికి చిన్నతనం నుండీ ఉపశమనం, మనశ్శాంతి పూజలే. భవాని పుట్టిననాడు పూజలో యేదో అనుభూతికి లోనయ్యారావిడ. అందుకే పట్టుబట్టి ఆ పేరు పెట్టారు. వెంట వెంట తిరిగేది. తల్లికన్నా తన దగ్గరే చేరిక ఎక్కువ.

పాలు గొంతులో నాలుగు గుటకలు పడగానే లేచి, వెనక వీపు మీదకి చేరి మెడ చుట్టూ చేతులు వేసి వెనక్కీ ముందుకీ వూగుతూ.."మామ్మ ఇది మన ఇల్లేనా?" అని అడిగింది.

"మనదేనమ్మా ఆ తాతగారిది. నీకు నాని అన్నయ్య ఎలాగో నాకు ఆ తాత గారు అన్నయ్య." అంది.

గబ గబా మంచం దిగి అలా మొక్కల్లోకి పరిగెత్తి ఓ నూరువరహాల గుత్తి తెంపుకుని తెచ్చింది. సీతమ్మగారిది బారెడు జుట్టు. ముడి పెడితే దోసిట పట్టేంత అయ్యేది. ముడివిప్పేసి, వచ్చిరాని జడ అల్లిక వేయటం మొదలెట్టింది భవాని. ఆ పిల్ల ఆ ఆట ఎప్పుడూ చేసేదే. అంతా అయ్యాక ఆ గుత్తి తలలో గుచ్చబోయింది.

"వద్దురా భవాని." మనవరాలిని వారిస్తూ అన్నారావిడ.

"ఎందుకు వద్దు మామ్మ?" అమాయకంగా అడిగిన అ పిల్లదాని కళ్ళలోకి చూస్తూ "తాత గారు లేరు కదా. అందుకు." అన్నారు.

"ఇక్కడా లేరా. మరి మనూర్లో అడిగితే వూరెల్లారన్నావుగా?" పిల్లదాని కళ్ళలో అపనమ్మకం.

"లేదు తల్లీ, దేముడు వూరికి వెళ్ళిపోయారు." ఆవిడ కళ్ళలో సన్నగా తడి.

సీతమ్మామ్మ ని అడిగే ప్రశ్నల్లో ఎక్కువగా "తాత గారు లేరు" అన్న సమాధానం వస్తుందని ఆ చిన్ని బుర్రకి అపుడపుడే తెలుస్తుంది.

'తను ఆటల్లో కుమారి జట్టు పచ్చీ కొడితే అమ్మాజీ తో ఆడుకుంటుంది కదా. మరి మామ్మ ఇంకో తాతగారిని తెచ్చుకోదా?' లీలగా వచ్చిన ఆ ఆలోచన పిల్ల దృష్టి పాక వెనగ్గా పరిగెడుతున్న ఎర్రావు లేగదూడ మీద పడటంతో అటుగా పరిగెట్టింది.

సన్నగా నిట్టూర్చి తనూ లేచి పిల్లని అనుసరించారు సీతమ్మ గారు. మునుపోసారి ఇలాగే దేముడి కుంకుమ పెడతానని పేచీ పెట్టి యేడ్చింది. ఇంకోసారి వాళ్ళ అమ్మ చీర తెచ్చి కట్టుకోమని మంకుపట్టు పట్టి కోడలు గదిలోంచి లాక్కేళ్ళే వరకూ హఠం వేసింది. ఇంకాస్త వూహ తెలిస్తేనే కానీ ఈ మారాములు మానదు అనుకున్నారావిడ.

ఓ గంటలోనే స్నానం చేయించి కాస్త పప్పుచారన్నం, పెరుగన్నం తినిపించగానే ఆ మంచం మీదనే ఆరుబయట మామ్మని వాటేసుకుని ఆవిడ పాడే పాట వింటూ పడుకుంది. భవాని అడిగడిగి పాడించుకునే ఆ పాట.


"అమ్మగారమ్మేది, ఆ పాల కొండేది, ఆ దొండ పండేది, అప్పుడు కాచిన నెయ్యేది. అమ్మా అమ్మా నిన్నేమన్నారే, కల కల వేగిన గారన్నారా? బుర బుర పొంగిన బూరన్నారా?" అని ఆవిడ అనగానే "నన్ను మా సీతమ్మామ్మకి దేవి ఇచ్చిన భవాని అన్నారు.." అనేది.

మాధవ రావటం, మిగిలిన మావయ్యలు, సంతానం కొందరు చేరటం అంతా కలిసి పిచ్చాపాటీ కబుర్లలో బాగా పొద్దు పొయ్యేవరకు మెలుకువగానే వున్నారు.


*************************************************

మాధవ తెల్లవారు ఝామునే బయలుదేరి వెళ్ళాడు. వెంట అతని పెద్దనాన్న కొడుకు చంద్రం, ఒక మేనమావ ధర్మరాజు వెళ్ళారు. హనుమాళీ గారు కూడ సందు మొగల్లో కలిసారు.

భవాని లేచే సరికి వేడి వేడి ఇడ్లీ వేసిక కమల తినిపించింది. "పద మరి ఇవాళ మీ తాతగారి తద్దినం. తలారా స్నానం చేసి నైవేద్యం పెట్టు." అంది.

అంతా అర్థం కాకపోయినా "తాత గారు" అన్నది గుర్తుపెట్టుకుని, మాట విని బుద్దిగా తయారైంది. కోరా రంగుకి మంకెన పువ్వు రంగు పరికిణీ, చేతులకి గాజులు, మెడలో పద్మం హారం, చెవులకి జూకా బుట్టలు. మనవరాలిని కళ్ళ నిండా చూసుకుని 'ఆయనకి అదృష్టం లేదు. కొడుకు ఎదిగొచ్చేనాటికి పిలుపు వచ్చేసింది. పెళ్ళి, మనవలు అన్నీ తనకి మాత్రం దక్కిన భాగ్యం' అనుకున్నారు.

అటుగా వచ్చిన కమల "నా దిష్టే తగిలేట్లుంది పిన్ని." అంటూ బుగ్గలు పుణికింది. పూల సజ్జతో మొక్కల్లో తిరిగి మందారాలు, నిత్యమల్లి, కరివేరు అవీ కోసుకొచ్చింది.

మామ్మ పక్కన కూర్చుని పూజ గమనిస్తూ ఆవిడ చెప్పినట్లు చేస్తూంది. భవానికి అన్నిటి లోకి తులసమ్మకి నీరు పోయటం, హారతి కి గంట కొట్టటం మహా ప్రీతి. అవి మాత్రం ఎవర్నీ చెయనివ్వదు.


భవానికీ ఐదో యేడు నడుస్తుండగా ప్రసాదం గా పెడుతున్న పటికబెల్లం పలుకులకి ముందే చెయ్యి చాపింది. "దేవికి నైవేద్యం పెట్టాక, మనం తీసుకోవాలమ్మా." అన్నారావిడ.

"మరి నేనే దేవీ ప్రసాదం అన్నావుగా. నేను భవానీని కాదా? నాకిస్తే దేవికి నేనిస్తా" అన్న ఆ చిన్నతల్లి మాటలకి, ఓ క్షణం నివ్వెరపడి 'అమ్మా పార్వతి, నన్ను మన్నించు ఇలా పసిదానితో పలికించావా.' అనుకుని ఆ నాటి నుండి పూలతో పూజే కానీ ఆవిడ ప్రసాదం మానేసారు.

మధ్యాహ్నం మూడు దాటే వేళకి గోదావరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు.

భవానీని చూస్తూ చంద్రం గారి అబ్బాయి అబ్బులు "మామ్మ భవానీకి నీ పోలిక వచ్చింది కదా?" అన్నాడు.

"కాదు మామ్మే నాలాగా వుంది." అని ఆరిందాలా చెప్తున్న భవాని మాటలకి అంతా నవ్వుకున్నారు.

మర్నాటికి తాతగారు చదివే పెద్ద పుస్తకాన్ని భగవధ్గీత అనీ, ఆయన వ్రాసేది రామకోటి అనీ కనుక్కుంది.

మూడోరోజు ప్రయాణమయ్యేనాటికి కమల వండిచ్చిన తొక్కుడు లడ్లు, చక్కిడాలు, కొబ్బరరిశెలు, మినపసున్ని ఇలా అన్నీ కలిపి మళ్ళీ ఐదారు శాల్తీలు అయ్యాయి. అబ్బులు యడ్ల బండి కట్టి వంతెన వరకు దింపాడు.

మాధవ ఆపిన వంతెన చేరగానే "మామ్మ, నాన్నగారికి ఇక్కడే తెల్లదొర తాయిలం ఇచ్చాడట. అందుకే పెద్దచదువులు చదివారట. నాకు నువ్వు తాయిలం ఇవ్వవా నేను సరస్వతి పూజ చేస్తాను." అంది భవాని.

"మాటల మూట ఇది, మామ్మ. వదలాలని లేదు." అంటూ "భవాని ఇక్కడ వుంటావా?" అని అడిగాడు అబ్బులు.

"ఊహూ, మా సీతమ్మామ్మ తాతగారి జట్టు పచ్చి చెప్పిందిగా. నేను కొత్త తాతగారిని తెస్తాను. నేను సరస్వతిని చూసి వస్తాను. అపుడు వస్తాను. నీకు ప్రసాదం ఇస్తాను అన్నయ్యా." అంది ఆ పిల్ల.

అంతా నవ్వుల్లో మునిగిపోయారు కానీ సీతమ్మ గారు ఆ పిల్ల మాటల్లో దృడత్వాన్ని గమనించారు. "ఈ పిల్ల అనుకున్నది సాదిస్తుంది. పట్టుదల ఆ దేవి ఇచ్చే దీవెన కావాలి." అని మనసారా మరోసారి మొక్కుకున్నారు.

"అలాగేలేవే చిన్న సీతమ్మ." అని మాధవ మురిపెంగా అన్నాడు. అప్పటి నుండి కొన్ని వందలసార్లు తన తల్లిని ఆ పిల్లలో చూసాడతను. తన నాయనమ్మ కథల్లో, కబుర్లలో ఎన్నో విషయాలు తెలుసుంటూ, చదువుల్లో, ఆట పాటల్లో రాణిస్తూ ఎదుగుతూంది భవాని. తులసమ్మ పూజలందుకుంటూ పచ్చగా కళకళలాడుతూ ఆ చిన్నారిని దీవిస్తూంది.

*************************************************

చూస్తుండగానే మరో పద్దెనిమిది యేళ్ళు గడిచిపోయాయి. సీతమ్మ గారు పూజల నుండి ధ్యాన మార్గం లోకి వచ్చారు. ఆవిడననుసరించి భవాని కూడా ధ్యానసాధనలోకి మారింది.

ఆవిడ ఓ రోజు తన జీవితం గురించి చెప్పి, తాతగారి చిత్రాన్ని చూపించారు. కోమలి తన తాతగారి వివాహం, వారిని అంగీకరించిన సీత క్షమ, కరుణ ఇవన్నీ ఎలా సాధ్యం? ఇది ప్రేమ చేసే గారడీనా? తన మనిషిని గూర్చిన ఆరాటమా? తన వరకు అనుకుంటే కుంచించుకుపోయే మనసు, తనవారికి అనేసరికి అలా విస్తరిస్తుందా? అందర్నీ కలేసుకుపోయే తత్వాన్ని కలగజేస్తుందా? అనిపించింది.
భవాని జీవితం ఆవిడ జీవితం నుండి యే పోలిక తెచ్చుకోనుందో కాలమే తెలపనుంది. కాలానికి అతీతంగా జీవితాల్లో మార్పు రాని అంశాలెన్నో వున్నాయి. అవి మనసుకి, మమతకి చెందినవి.

భవాని చదువు పూర్తి చేసుకుని, మంచి ఉద్యోగస్తురాలైంది. సీతమ్మ పోలికలు పుణికిపుచ్చుకున్నా ఆధునిక భావాలతో పాటు ఆవిడ నేర్పిన వినయం, పద్దతులు, సాంప్రదాయాలు కూడా అలవరుచుకుంది.

మొదటి జీతం నాటి నుండీ వృద్దాశ్రమాలకి, నిస్సహాయ స్త్రీలకి తన వంతు ఆర్థికసహాయం అందిస్తుంది. పిల్లల్లో చదువుకోవాలన్న ఆసక్తిని కలగజేసే ప్రయత్నాలు, సహాయ కార్యక్రమాలు చేసేది.

సీతమ్మ పంచిన అనురాగమే తన గుండెల నిండా నింపుకుంది. చదువు అవగానే పెళ్ళై ఒక బిడ్డకి తల్లైంది.


పిల్లాణ్ణి చూడటానికి వచ్చిన మేనత్త వొడిలో పడుకోబెట్టి, "మామ్మకి నువ్వైనా చెప్పు అత్తయ్యా? నాతో తీసికెళ్తానంటే రానంటుంది. అమ్మ అశక్తురాలు. మామ్మ వస్తే నాకు తోడుగా వుంటుంది." అంది భవాని.

"బిడ్డ మీద బిడ్డలా నేను వస్తే నీకు ఆటంకమే కానీ ఆసరా ఎక్కడిది తల్లీ.." సీతమ్మ మాట అవక మునుపే "మరదే నిన్ను పనికా తీసుకువెళ్ళేది." చిరుకోపంగా ఆడిగింది.

వెనక్కి తిరిగి వెళ్తున్న మేనకోడల్ని చూస్తూ "అమ్మా ఇది నిజంగా 'చిన్న సీతమ్మే' ఆ వాటం, ఆ జడ అదీ.." అంది మేనత్త.

భవాని స్నానం అయ్యి వచ్చేలోగా సీతమ్మ గారు తన చెవి దుద్దులు తీసి, కడిగించి మనవరాలి చేతిలో పెట్టి "భవానీలు మామ్మ గుర్తుగా పెట్టుకోమ్మా." అన్నారు.

రెండు కళ్ళ నిండా వూరిన కన్నీరు తుడిచే ప్రయత్నం చేయకుండా "మామ్మ నేను నీ బంగారాన్నే ఎప్పటికీను. నీ జీవితమే నాకు కొంగు బంగారం." అంది.

మేనత్త బలవంతంతో ప్రయత్నించినా దుద్దులు పట్టక, ఎదురింటి కస్తూరి అక్క సలహా మేరకి పొగాకు కాడలు పెట్టుకుంది, ఓ వారానికి కాస్త తమ్మి సాగి దుద్దులు పడతాయని.

ఆ సాయంత్రం వచ్చిన బంధువు, వరసకి బావ అయిన గాంధి మేళమాడుతూ "ఏమే చిన్న సీతమ్మ, చెవి వెనకాల పెట్టుకోవాల్సిన ఆ చుట్టలు, చెవిలో పెట్టావేమే. నువ్వూ మీ మామ్మలా తింగర బతుకు బతుకుతావా?" అని నవ్వాడు. అతనికి అలా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట జారటం బాగా అలవాటు.

"లేదు బావ, ఎలాగైనా మా మామ్మ దుద్దులు పట్టించాలని ఈ ప్రయత్నం." అంది చిరునవ్వుతో భవాని.

సీతమ్మ గారి కళ్ళలో తృప్తి, మనసులో ప్రశాంతత. మనవరాలు తన మాదిరి కాదు. మంచి, మన్నన ఎరిగిన పిల్ల, తెలివైనది, తన కాళ్ళ మీద నిలబడ్డ పిల్ల. జీవితానుభవాలు చదివింది. కష్టాలు సుఖాలు చవిచూసినా సమర్థవంతంగా బండి లాగగలదు అనుకున్నారు.

*************************************************

అనుకున్నట్లే సీతమ్మ గారిని వెంట తీసుకుని వెళ్ళింది.

ముని మనవడికి సీతమ్మ గారు మనవరాలికి పాడిన పాట మళ్ళీ పాడుతున్నారు. పనికి తోడుగా వచ్చిన ముత్యాలు కాళ్ళ మీద వేసుకుని నువ్వుల నూనె రాసి కాళ్ళు చేతులు సాగదీస్తుంటే బోసిమొలతో, వేళ్ళు గుప్పిట పెట్టి నోట్లో కుక్కుకుని కిల కిల కేరింతలు కొడుతున్న కొడుకుని మురిపెంగా చూసుకుంటూ, భవాని అప్పటికప్పుడు రాసి, బాణీ కట్టి పాడుతున్న పాట.

మాటా మంతి లేదు,
సిగ్గు ఎగ్గు లేదు,
నోటిలో మాత్రం వేలు,
నవ్వులో మంచి ముత్యాలు,
చెప్పుకు పోతే వేవేలు,
మా చిన్నీ తండ్రికి జేజేలు.

అనుభవం కూడా కొంగు బంగారమే. సీతమ్మ గారి జీవితం, మాధవలో బాధ్యతని పెంచితే, భవానీకి భావికి బాట చూపింది. వారిరువురి జీవితాలు తర్వాతి తరాలకి మార్గదర్శకం. తులసమ్మ కి కుంకుమ పెట్టి, నీరు పోస్తూ నానమ్మ నుదుట కుంకుమ లేని కారణాలు వెదికిన భవాని ఈ నాటికీ తులసిమొక్క పెంచుతూనే వుంది. ఆ మొక్క నాటిన కుండీలోని మట్టిని పవిత్రంగా నుదుట ధరిస్తూనేవుంది.