పోకడ

కొండ ఎక్కబోయి వెల్లకిలా పడిన మబ్బు
బండరాళ్ల కింద చెమ్మగా చిక్కుకుపోయింది

వేళ్ళని తడిమే వాగులోకి ఒరిగిన తరువు
ఘడియకొక దిక్కులో గొడుగు పడుతుంది

వెదురు పొదల్లో తనువు మరిచిపోయిన గాలి
మోదుగ కొమ్మతో మూగనోము పట్టించింది

వైనాలన్నీ సహజమేనే!

ఏమరుపాటుగా ఉన్న మనసు
పాత ఊసులే తిరగ రాసుకుంటుంది, ఎప్పటి మాదిరిగా. 

అమాశ రాతిరిలో విరిసిన గిన్నెమాలతి పూలద్యుతిని,
ఒంటరి క్షణాల్లో వెన్ను తట్టిన ధృతిని
విడదీయలేక సతమతమౌతుంది...

మండు వేసవి మధ్యాహ్నాల్లో
మేనికి అలుముకున్న వట్టివేరు గంధాలు,
పట్టి పట్టి చదువుకున్న పంక్తుల్లో
తేనియ మధురిమలు
ఒక్కటేనని పంతమాడుతుంది 

ఊహలన్నీ సహజమేగా!?

No comments:

Post a Comment