చేతి సంచీ

నాన్న చేతి సంచీ నా చేతి కొచ్చింది
నిండా మోస్తున్న జ్ఞాపకాల బరువు
ఒకటొకటిగా, విడివిడిగా, మూకుమ్మడిగా
నాతో ముడిపడున్నవేవో లెక్కగడుతూంటే-

మూరెడు జాజులు, చిట్టిచేమంతి దండలు,
తామరాకు పాన్పు మీద నాగావళులు..
జిలేబి, పకోడీ గుట్టు విప్పిన ఘుమఘుమలు,
సందెగాలి మోసుకొచ్చిన పరాచికాలు..
ఊరుసద్దుమణిగాక పుట్టే ఊసుల భోషాణం,
కొత్త మురిపాల జోరుకి సాక్ష్యం చేతిసంచీ.

దినసరి వెచ్చాలు, పండుగ సరంజామాలు
ఉయ్యాల తాళ్ళు, గిలక్కాయల మోతలు.. 
పలకా బలపాలు, పుస్తకాలు, పూస మిఠాయిలు
కాలిపట్టీలు, పరికిణీలు, పెళ్ళి శుభలేఖలు..
సాంసారిక పయనాల కథాసరిత్సాగరం,
శతకోటి గాథలు తీసినా తేలికపడని చేతిసంచీ.

నిజానికి నాన్న జీవితం ఆ చేతి సంచి
నా గుండెగూటి లో తనని ఇంకాస్త సర్దుకోవటానికి. 
ఒకరిగా, నాన్న బిడ్డగా,  నాన్నని దాటే పోటీదారుగా
సంచీ మోసుకుంటూ బ్రతుకు వీధిలోకి అడుగు పెట్టాను. 

5 comments:

  1. naku ma naanna cheti sanchi gurtu vachindi.. very nice..

    ReplyDelete
    Replies
    1. So touching a feedback..thanks హిమజ ప్రసాద్ gaaru!

      Delete
  2. !!కవితా సారం !!మరువం ఉష గారి కవిత !చేతి సంచి!
    _____పుష్యమి సాగర్

    చిన్నతనం లో నాన్న బయిటకు వెళ్ళినప్పుడు మోసుకు వచ్చిన చేతి సంచి ఎన్ని అనుభూతులను మోసుకు వచ్చిందో లెక్క పెట్టుకోలేము. ఉష గారి ఈ కవిత లో చాల వరకు అనుభూతలను మళ్ళీ తిరిగి తోడుకుంటున్నారు. ఎంతో మంది కి తమ నాన్న గారి చేతి సంచి తో అనుబందం ఉండొచ్చు.

    ఒక సంచి చుట్టూ కదా వస్తువు ని తీసుకొని అల్లిన కవిత లో ..చాలా చోట్ల భావోద్వేగం అక్షరాల్లో వొదిగిపొతయి , కొన్ని చోట్ల బాల్యం తాలూకు ఆనందాలను తోడూకుంటున్నట్టు గా వుంటది

    //జిలేబి, పకోడీ గుట్టు విప్పిన ఘుమఘుమలు,// అవును చిన్నప్పుడు నాన్న ఇంటికి రాగానే...ఏమి తెచ్చారు మాకు అంటూ పిల్లల హడావిడి ఇప్పటికి మననం చేసుకుంటాం .

    చలనం లేని వస్తువు కూడా ప్రాదాన్యత సంతరించుకుంటుంది మన జన జీవితం లో, అన్ని వస్తువు లాగానే చేతి సంచి కూడా, కాని ప్రతి దినం మన తో నే వుంటూ అనుక్షణం కావాల్సిన అవసరాలను అది వెచ్చాలు అయిన , పండుగ లలో కావాల్సిన సరుకు అయిన ఇది వుండాల్సిందే. అంటే మానసికం గా అది ఒక స్నేహితుని లా పని చేస్తుంది ఏమో ...కదా...!!!

    పుట్టుక నుంచి మొదలు ప్రతి దానికి సంచి లేకపోతె ఇబ్బందే, పిల్లల దగ్గరనుంచి పెద్ద వారి దాక. సంచి ఎన్ని వాహకాలు మోసుకుపోతున్నదో , ఇదోక అనంత మైన సంసార కదా చరితం కదా...

    //సాంసారిక పయనాల కథాసరిత్సాగరం,//

    కొత్త పద ప్రయోగాన్ని ఉపయోగించటం బాగుంది ...ఉదా: "ఊసుల భోషాణం", "మోసుకొచ్చిన పరాచికాలు."

    కవిత ముగింపు లో ... అక్షయ పాత్ర లా ఎంత తీసిన తరగని అనుభవాలను, అనుభూతులను
    గుండె కు హత్తుకోవచ్చు నిజమే కదా....ఒక నేస్తం లా మన వెంట వుండే సంచి ని వదులుకొగలమా..లేదు ....

    //సాంసారిక పయనాల కథాసరిత్సాగరం,//శతకోటి గాథలు తీసినా తేలికపడని చేతిసంచీ.//

    ఉష గారి కవిత ను చదివాకా...జీవితమే ఓ సంచి అనిపించింది. చిన్న కవిత అయిన ఎంతో బాగా చెప్పారు ...వారు మరిన్ని మంచి కవితలని రాయగలరని ఆసిస్తూ ...

    సెలవు .

    ReplyDelete