జగత్తే మందిరమైతే...

"శిథిలాలయమ్ములో శివుడు లేడోయి
ప్రాంగణమ్మున గంట పలుకలేదోయి
దివ్యశంఖము గొంతు తెరవలేదోయి
పూజారి గుడినుండి పోవలేదోయి!
చిత్ర చిత్రపు పూలు చైత్రమాసపు పూలు
ఊరూర, ఇంటింట ఊరకే పూచేయి
శిథిలాలయమ్ములో శిలకెదురుగా కనుకు
పూజారి కొకటేని పువ్వు లేదోయి
వాడ వాడల వాడె, జాడలన్నిట వాడె
వీడు వీడునవాడె, వీటి ముంగిటవాడె
శిథిలాలయమ్ములో శిలకెదురుగా కనుకు
పూజారి వానికై పొంచియున్నాడోయి" - దేవులపల్లి

ఈ అక్షర వీవెన గాయపడ్డ బాధకి సపర్యలు చేస్తుంది. తేరుకున్న బాధ (అసలీ వేదన మూలాలు కూడా ఇంకా తెలీని జీవితం) గుండెని ఆపుడపుడూ గుచ్చుతూనే ఉంది. నీరవ నిశీధిలో నక్షత్ర ఖచిత ఆకాశం దివ్య లోకాల ఆనవాళ్ళకి పెట్టిన దీపావళి లా ఉంది. ఎక్కడిదో దిగంతాల రాగాలు మోస్తూ ఓ గాలి వీచిక... నాలోని రాగద్వేషాల కచ్చేరి నిరంతర గీతం లా శ్వాసనిశ్వాసలంత లయతో సాగూతూనే ఉంది.

కానీ, అనుకోని ఒక అరుదైన ఓ వేకువ ఘడియలో వేదనా సాగరాల్లోకి విసిరిపడ్డ కన్నీటిచుక్క, సత్యాన్వేషణ చిప్పలో పడింది, ముక్తాఫలమై దీప్తి చెందింది. ఒకదాని వెంట మరొకటి చేరుతూ ముక్తాఫలాలు అనుభవపు తీగలోకి ఆవళి గా అమిరాయి. మౌక్తిక పరావర్తనం లో గూడుకట్టిన విషాదం ఎదిగిపోయింది, ఎదిగిన గిరి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్షణపు ప్రశాంతత శాశ్వతం కానీయి. మానవీయ బంధాలకి అర్రులు చాచి బంధనాలలో బందీ అవుతున్న శాపాన్నుంచి నన్ను విముక్తిచేయి.

ఇపుడు నేను ముత్యాల మాల పట్టుకుని ఉన్నాను. ఈ జపం లో ఒక్కొక్క వేదన పఠిస్తూ దరికి రానున్న సచ్చిదానంద స్థితికి మనసులో కైమోడుస్తున్నాను. స్వామీ, నన్ను జవాబీయని లోకానికి ఒక ప్రశ్నలా సంధించకు. సమాధానపడ్డ ప్రాణి గా నడిపించు. వేసట గురుతెరగక సాగాల్సిన బాటసారినన్న నిశ్చయాన నన్ను నిలుపు... ఈ ఆత్మలోని భావన:

జీవితాన్ని నిశీధిగా ఎంచి, కలల మినుకులకి, రాలిపడే శకలాల పోలు ఆనందాలకి అర్రులు చాచి, బధిరుడినై, బాధితుడినై, బంధితుడినై రసావేశ మానసాన వేగితిని, శుష్క యోచనల చిక్కితి. భగ్న పుఠల పీఠిక సమస్తం నలిగిన ప్రేమాన్వేషణలేనాయే. నిర్మాల్యము తొలిగిన మానసం కఠినశిలాసదృశ్యమాయే. స్వస్థానపు జాడలు వెదుకుతు అలిసితి, అంతఃకరణ లో అనంత సౌందర్యపు ఆనవాళ్ళు కంటి, మహానంద బ్రహ్మము కలదని విశ్వసించితి. శ్వాసనిశ్వాస లయలో నిజ స్పృహ కలిగి చరింతునికపై, హృదయ పర్ణశాల లో ఆశ్రమ వాసినై తపము చేసెద అను నిత్యం.

శూన్యంలో మౌనాన్ని నేను
మౌనంలో రాగాన్ని నేను
రాగంలో భాష్యాన్ని నేను
భాష్యంలో భావాన్ని నేను
భావంలో జీవాన్ని నేను
జీవంలో పూర్ణాన్ని నేను
నేనన్న అహాన్ని వీడిన బ్రహ్మ

నిత్యసత్యమై వెలిగేలా చేయి-

18/03/14

1 comment:

  1. ఈ పాట MP3 రూపంలో (పాట రూపంలో) మీ వద్ద ఉంటే వీలైతే పోస్ట్ చేయగలరా

    ReplyDelete