కురవక కుసుమం – మరువక పత్రం

“ఆంజన గంధీమ్ సురభీమ్ బహ్వన్నమ్ ఆకృషి ఫలామ్
ప్రా అహమ్ మృగానామ్ మాతరమ్ అరణ్యానీమ్ ఆశంశిషామ్”

(అంజనగంధి, సౌరభం వ్యాపింపజేసేది, పుష్కలంగా ఆహారం ప్రసాదించేది, కృషిచేయకనే ఫలమిచ్చే శక్తిగలిగినది, మృగాలకు తల్లి అయిన అరణ్యాని దేవికి మ్రొక్కుతున్నాను)

అప్రయత్నంగా మునుపు చదివిన “వనవాసి” నవలలో ప్రస్తావనకి వచ్చిన - ఋగ్వేదంలోని అరణ్య దేవతని గురించిన – స్తోత్రం నా హృదయమండలాన ప్రతిధ్వనించింది. అందుకు కారణం; వినాయక వ్రత కథ లోని నైమిశారణ్య వర్ణన. ఆ కానన దర్శనం నాలోని ప్రకృతారాధకురాలికి మృష్టాన్నభోజనం అనే చెప్పాలి.

“శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండగు భగవంతుని సృష్టిని శ్రేష్టమగు ఈ భరతఖండమున నుత్తరభాగమునందు ఆర్యావర్తమను పుణ్యభూమి యొప్పుచుండు. అందు కల్హార కేదార కరవీర జాజి విరజాజి జపా పాటలీ కేతకీ నాగ పున్నాగ మల్లికా మతల్లికా కుంద కురవక మందార చంపక చాంపేయా ద్యనేక పుష్పరాజి విరాజితమును, సాల రసాల తాలహింతాల తమాల తక్కోల చూత పూగ వకుళ అశోక కపిత్థాశ్వత్థప్లక్ష కాద్యనేక వృక్ష శోభితంబును, హంస కారండవ చక్రవాక జలకుక్కుట కోకిలాద్యనేక పక్షికృత కోలాహల నివాహంబును, నిర్మల ప్రవాహ రమణీయ సరోవరయుక్తంబును, ప్రాణాయామ ప్రత్యాహార ధాన్యధారణ సమాధ్యష్టాంగ యోగా నిష్ఠాగరిష్ఠ హరి హర పూజా మకరంద పానానంద తుందిల హృదయారవింద మౌనివర్య దివ్యాశ్రమ విలసితంబునగు నైమిశారణ్యంబు వెలయుచుండు.”

చదువుతుండగానే “వనవాసి” నవలలో పరిచయమైన లవటులియా అడవి లోని సరస్వతీ హ్రదం, కుశీనది,పూల్కియా, నాఢా, మోహన్పురా మహారణ్యాల దివ్య సౌందర్య కాంతులు ఒక్కసారిగా పునర్దర్శనమిచ్చాయి.

ఈ మధ్యనే అలవడిన కావ్యపఠనాలు మరిన్ని జాడల్ని అప్పజెప్పాయి. ఉదాహరణకి 'సంగీత రహస్య కళానిధి' బిరుదాంకితుడైన రామరాజభూషణుని “వసుచరిత్రము” నుంచి వసంత ఋతు ప్రభని, ప్రభావాన్ని కళ్ళకు కట్టించే ఈ పద్యాలు.

సీ:// లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికా భంగ దోఃప్రసంగ
మలసానిల విలోల దళసా సవ రసాల ఫలసాదర శుకాల వన విశాల
మలినీగరు దనీక మలినీకృత ధునీ కమలినీ సుఖిత కోక కుల వధూక
మతికాంత సలతాంత లతికాంత రనితాంత రతికాంత రణతాంత సుతనుకాంత

తే.గీ.// మకృత కామోద కురవకా వికుల వకుల
ముకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠ కులకంఠ కాకలీ వి
భాసురము వొల్చు మధుమాస వాసరంబు

అలాగే గజేంద్ర మోక్షము కథలో ఘోరాటవి పద్యము, గద్యము గా వర్ణించబడింది. నాకు యధావిధిగా అడవిని గురించిన దర్శనాలు గగుర్పాటుని కలుగజేశాయి.

వచనము:
అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బరరీ వకుళ వంజుల వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర బారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర బసంతనమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్నిపహాలంకృతంబును, మణివాలుకానేక విమల పులినతరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మ్హోద్యాన శుక పిక నికర నిశిత సముంచిత చంచూపుట నిర్దళిత శాభిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్రప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, గనక మయ సలిల కాసార కాంచన కుముదకహ్లార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విటసముదయ సమీపసంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జకుక్కుట చక్రవాక బక బలాక కోయప్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీబూత భూనభోంతరాళంబును దుహినకరకాంత మరకత కమలరాగ వజ్రవైదూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కధౌత మయూనేక శిఖరతట దరీవిహరమాణ విద్యాధరవిబుధ సిద్ద చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిధున సంతత సరససల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును, గంధగజ గవయ గండబేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలాపృక వరాహ మహిషమర్కట మ్హోరగ మార్జాలాది నిఖిల మృగనాధ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై యొప్పు న ప్పర్వత సమీపంబునందు.

మరి కాస్త ఆసక్తి పుట్టి అక్కడా ఇక్కడా వెదికితే

“వన్యధాస్యంబులు ముడియలం గావళ్ళం బెట్టించు
కొని కదలి కదలికా, చందన, స్యంద్న, మరువకా, గురు, కురవకా
శోక పూగ పున్నాగ, భూర్జ, ఖర్జూర…”
అంటూ శకుంతల కి పెట్టిన సారె తాలూకు వివరాలు పలుకరించాయి.

నిజానికి ఈ పద విందులు పుష్కలంగా అందించే మన సాహిత్య మనే పర్వతపాదాన నాకీ అలౌకిక ఆనందం ప్రాప్తించిందేమో! రానున్న నాళ్ళలో మరిన్ని భాగ్యాలు కలుగుతాయేమో.

ఈ వర్ణనలు నాకు పూర్తిగా పదం పదం గా అవగతమయ్యాయా అన్నది కాదు ప్రశ్న, అలా చదువుతూ పోతుంటే, భాషతో పనిలేని ఒక అనుభూతి కలుగుతుంది. ఆ వనాల్లోకి వెళ్ళి రాగలిగాను. ఆ కాలాల కమనీయతని చూస్తున్నాను.

మళ్ళీ మళ్ళీ చదువుతుంటే ఎన్నోసార్లు ఆఘ్రాణించిన మరువక పత్ర మధురిమ మనసుని ఊపేసింది. ఒక్కసారైనా కురవక కుసుమాన్ని చూడాలనిపించింది. కనీసం చూసినవారిని చూడాలనిపించింది. రక్తపలాశ వృక్ష ఛాయల్లో చరించాలని ఉంది. చక్రవాకాన్ని వెక్కిరించాలని ఉంది.

నాలాంటివారు చెప్పే ఊసేదన్నా ఉంటే వినాలనీ ఉంది.

02/25/2014

No comments:

Post a Comment