సచిత్రం

పెరుగుతూనో తరుగుతూనో సగమయ్యాడు చంద్రుడు నేటికి
పరుచుకున్న చీకటిని చీల్చుకుంటూ.
తారలుంటాయి ఎపుడో అపుడు మినుకు మినుకుమంటూ
వాలిన పొద్దు దిక్కున-
దిగంతంలోకి మునకలుగా అటుగా సూర్యుడు ఇంకా అక్కడే.
విదుల్చుకుని, విడివడి- ఒకటి వెంట మరొకటిగా మబ్బులు సాగిపోతూ రంగులు మార్చుకుంటూ
వాకిట్లో గాలులకి కొమ్మల ఊగిసలాట,
కిటికీ తెర నుంచి దూసుకుని నీడల కుంచెతో గోడలు నింపుతూ
గడ్డి పక్కల మీద రాలిన ఆకులు పొర్లాడే పాపాయిల్లా
రాత్రి నుంచి రాత్రికి కొన్ని లెక్కలు; ఉదయం నుంచి మరునాటికి ఇంకొన్ని మార్పులు
కాలప్రవాహానికి కొండగురుతులుగా.
ఋతువు రాకపోకలకి అడ్డూ అయిపూ ఉండవు; అయినా శ్రుతిలయలు చూపుకందుతాయి...

కాలప్రవాహం

ఉరుములు వినవస్తూ, ఉప్పెనలు కానవస్తూ
ముసురులు వీడని మనసున-
మబ్బులు గడ్డిదుబ్బులై మొలుచుకు వస్తూ,
నిబ్బరపు నిగ్గు తేలుతూనే, నిలవనీయని వేదనకి నిట్టూర్పు నీడగా...

'ఉంటుండేవి,' అని చెప్తూ ఉన్నానిప్పుడు

నవ్వుల జల్లులు కురిసి, జ్ఞాపకాల మునకల మురిసి  
ఊసులు కమ్మిన మనసున-
పచ్చని కలలు కమ్ముకువస్తూ,
అబ్బరపు అంచులు తాకుతూ, నిలవనీయని వేడుకలె ఓదార్పు జాడగా...

'వస్తున్నాయి,' అని చెప్తా ఇకిప్పుడు

5y @జీవని

అనగనగా ఒక చిన్నారిలోకం,
అమ్మ ఒడి, నాన్న పంచే బలిమి కలబోతల "జీవని"
ఆ చల్లని జీవన వాహిని లో గలగలలు ఈ పిల్లలు
అందరిదీ ఒకే మూలం...మానవత్వం!

పూల రంగులు, పాల పొంగులు చిన్ని ఊసుల్లో
మంచి గంధాలు, ఫల మాధుర్యాలు చేతల్లో
లేడి పరుగులు, తువ్వాయి చిందులు పాదాల్లో
బడి గుడిగా, బ్రతుకు లక్ష్యంగా...బాల్యం!

అమ్మైనా నాన్నైనా ఉండుంటే సాగని సరదాలు
అర్థం పర్థం ఎరుగని పోటీ లేని పయనాలు
ఆటపాటలు, లలితకళలు మురిసి విరిసే ప్రాంగణాలు
ఎదుగుతూ- ఎదుగుతున్న ఒద్దికలో- ప్రతిభా ప్రావీణ్యాలు

"జీవని" ఎవరంటే!? చిందే నవ్వులా, చెదరని మమతలా-
ఉత్తేజం ఉత్ప్రేరకం ఉత్సాహం ముప్పేట అల్లిన దారం,
ఆ లోగిలి మమతలు పెనవేసి కట్టిన దండకి.
మానవీయ వైనాలు కొలువుదీరిన ఆలయం

/* తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలను సమాజంలో భాగస్వాములను చేయడం, తరచుగా వారిని దాతలతో మాట్లాడించడం అన్న ప్రధాన లక్ష్యాలతో జీవని పని చేస్తోంది. ఈ విధంగా పిల్లల్లో మానవ సంబంధాలను నెలకొల్పడం మన ఉద్దేశ్యం. ఈ సంవత్సరం 10 మంది పిల్లలతో జీవని స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభం అవుతోంది. కరువు జిల్లా అయిన అనంతపురంలో మేము తలపెట్టిన ఈ యగ్నం విజయవంతం కావాలని అందరి ఆశీస్సులు కోరుతున్నాం.*/

Source: http://jeevani2009.blogspot.com/2009/06/blog-post.html

స్నేహాన్ని తలుచుకోవాలా?


Every friendship starts when a heart extends a hand: Happy Friendship Day! ఒక రోజున, ఒక మాటగా, ఒక తీరుగా వెలికి తేలేని క్షణాన అసంబంధంగా తోస్తూనే అవ్యక్తానందం మిగిల్చేది ఏది? చెలిమి కాదా?! తాటాకు బొమ్మ, ఈతాకు బూర, కొబ్బరిపుల్లల విల్లంబులు, రేగివడియాల పంపకాలు, తాయిలాల తన్నులాటలు, ఏడు పెంకుల కుమ్ములాటలు, చింత గింజల చిరు కయ్యాలు, కోనేటి గట్టున కలబోతలు, పుస్తకాల మడతల్లో ముసిముసి నవ్వులు, గుప్పిట్లో రహస్యాలు, దోసిట్లో జాజులు, సందిట్లో సంబరాలు, ఇంకు మరకల ఉత్తరాలు, చేతిలో చెయ్యేసి ఊసులు, ఫోను ముచ్చటలు, ఈ-మెయిలు కొసమెరుపులు, బ్లాగు బంధాలు, ముఖపుస్తకపు అనుబంధాలు, వాట్సాప్ వాలకాలు... ఎక్కడో ఒక చోట స్నేహపు ఆనవాలు నాకు గురుతే. "చెలిమికి ఇన్ని చిరునామాలా!?" అని అబ్బురపడుతూ ఒక్కో పేరు చేరువగా చేర్చుకోవటమూ షరా మామూలే.
తెలిసినదానినుంచి, తెలియనిదానినుంచి, వాస్తవంనుంచీ, ఊహనుంచీ అనుభూతిని తవ్వి తీయగలాది మైత్రి కాక మరేవిటీ? కలిమిలో బలిమిలో లేమిలో ఓటమిలో కలలో, కలకలం లో తోడై, కొన్ని సార్లు వెనుక నీడై, మరిన్ని సార్లు ముందరి దారై, మరి మిగిలిన మార్లు అడుగు కలిసి చేయి కలిపి నడిచిన నేస్తపు పేరు, రూపు చెప్పనా? వద్దులే, ఇదిగో ఈ చాపిన చేతికి అద్దుకున్న జాజర చాలదూ, స్నేహ పరిమళం నిన్నూ కమ్ముకుపోను...