నిత్యశోభ

పగలంతా
ఆకాశం నోరావలించి
తెల్లబోయి చూసింది,
నక్షత్ర భరిణెలు
తెరుస్తూ 
నడిచి పోయినట్లున్నారెవరో!
పరుగులు పెడుతూ
వెన్నెల కాంతులు
నేలపై వాలుతున్నాయి.
రేకుల దోసిలి పట్టిన
జాజుల నెత్తావి
అద్దుకుంటున్నాయి
కలం మూయకనే
ఊహలు నిదురలోకి
జారుకున్నాయా?
కలల పుస్తకం పుటలు
రంగుల్లో
మెరిసి పోతున్నాయి
నిన్న విన్న పాటొకటి
తలపుల
తడారనివ్వట్లేదు.
పొడిబారిన కన్నులు
రెప్పతోడుకని
తహతహలాడుతున్నాయి
నీడ ఒకటి
బాట మీద ఇటుగా సాగింది.
నిట్టూర్పు సడలిన ఊపిరి
నిమ్మళించింది...
ఆకు కంబళిలో
తలదాచిన గాలి
తొంగిచూసింది.
నవ్వుల మూటలు
వీపునెత్తుకుని
వాకిలి దాటింది

No comments:

Post a Comment